ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారడం మనం చూశాం. కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఈ విమర్శలు, ప్రతి విమర్శలపై కొన్ని రోజులుగా పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆమె అన్నారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ దారుణ ఘటనపై ప్రజలకు నిజానిజాలు తెలియాల్సి ఉందని అన్నారు.
లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాశానని షర్మిల తెలిపారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సీజేఐని కోరామని చెప్పారు. తిరుమల డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందని… ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందేనని అన్నారు.రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా అని వైఎస్ షర్మిల .. సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. బాబు శాంతి హోమాలు చేస్తున్నారని, పవన్ దీక్షలు చేస్తున్నారని, జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఈ ముగ్గురూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని ప్రభుత్వానికి తెలుసని, జంతువుల ఆయిల్ కలిపారు అని తెలుసని, ల్యాబ్ రిపోర్ట్ సాక్ష్యాలు కూడా ఉన్నాయని, అయినా చర్యలు మాత్రం లేవని షర్మిల ఆరోపించారు.
చర్యలు లేకుండా మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ సర్కార్ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే, కూటమి సర్కార్ లడ్డూలో మత రాజకీయాలు కలుపుతున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు. చర్చిలో,మజీద్ లో ఇలా జరిగితే ఊరుకుంటారా అని పవన్ అడుగుతున్నారని, హిందూమతం అంతానికి కుట్ర అని కేంద్ర మంత్రులు అంటున్నారని, మత ఘర్షణలు జరగాలని హిడెన్ అజెండా పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారని, మోడీ డైరెక్షన్ లో బాబు సర్కార్ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. అలాగే మోడీ కూడా చర్యలు తీసుకోవడం లేదన్నారు.