Anemia : మనదేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక రకాల అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య ఒకటి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందిలో రక్తహీనత సమస్య వస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని వెల్లడైంది.
NFHS తాజా డేటా ప్రకారం 2015-16లో దేశంలో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 58.6 శాతం ఉండగా.. అది తాజాగా 67 శాతానికి చేరుకుంది. అలాగే మహిళల్లో అది 54.1 శాతం నుంచి 59.1 శాతానికి చేరుకుంది. అందువల్ల రక్తహీనత బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సమస్య నుంచి సహజసిద్ధంగా ఎలా బయట పడాలో నిపుణులు వివరిస్తున్నారు.
మన శరీరంలో తగినన్ని ఆరోగ్యవంతమైన ఎర్ర రక్త కణాలు లేకపోతే ఆ స్థితిని రక్తహీనతగా చెబుతారు. ఎర్ర రక్త కణాలు మన శరీరంలో కణాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి. హిమోగ్లోబిన్ సహాయంతో ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని ప్రతి చోటుకు ఆక్సిజన్‌ను పంపిస్తాయి. దీంతో మనకు ఆక్సిజన్ సరిగ్గా లభించి ఆరోగ్యంగా ఉంటాం. అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.
అయితే రక్తహీనత సమస్య అనేది అనేక కారణాల వల్ల వస్తుంటుంది. సూక్ష్మ క్రిముల ఇన్‌ఫెక్షన్లు ఏర్పడడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పోషకాహార లోపం, ముఖ్యంగా ఐరన్ లోపించడం.. వంటి అంశాలన్నీ రక్తహీనతకు కారణమవుతాయి. ఈ క్రమంలోనే రక్తహీనత ఏర్పడితే మన శరీరం పలు సంకేతాలను చూపిస్తుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారిలో అలసట, తలతిరగడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తలనొప్పి, చల్లదనాన్ని తట్టుకోలేకపోవడం.. వంటి సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. రక్తహీనత ఉన్నట్లు తేలితే వైద్యులు ఇచ్చే మందులను వాడాలి. దీంతోపాటు పలు ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
మాంసం, కోడిగుడ్ల ద్వారా మనకు ఐరన్ బాగా లభిస్తుంది. వాటిల్లో బి విటమిన్లు, రాగి, సెలీనియం కూడా ఉంటాయి. అలాగే చేపలు, రొయ్యలు, పప్పు దినుసులు, పాలకూర, బాదంపప్పు, వాల్ నట్స్, కిస్మిస్ లు, ఖర్జూరం వంటి వాటిల్లో మనకు ఐరన్ బాగా లభిస్తుంది. దీంతోపాటు విటమిన్ బి12, డి లు కూడా లభిస్తాయి. ఇవన్నీ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేసేవే. అందువల్ల ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.