Copper : ఐరన్ లోపం ఉంటే రక్తం బాగా తక్కువగా ఉంటుందని, రక్తహీనత సమస్య వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఐరన్ మాత్రమే కాదు, మన శరీరానికి అవసరం అయిన మినరల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. వాటిల్లో రాగి (Copper) ఒకటి. మన శరీరంలో అన్ని పోషకాలు సరైన స్థాయిల్లో ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏదైనా లోపిస్తే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక రాగి లోపం వల్ల కూడా మనకు పలు వ్యాధులు వస్తుంటాయి.
మన శరీరానికి రాగి చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతుంది. రాగి లోపం అనే మాటను చాలా మంది విని ఉండరు. కానీ అది కూడా ఉంటుంది. ఐరన్ లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. రాగి లోపం వల్ల కూడా పలు లక్షణాలు మనలో కనిపిస్తాయి.
జింక్ ను అధికంగా తీసుకోవడం, శరీరం మనం తిన్న ఆహారాల్లో ఉండే రాగిని శోషించుకోలేకపోవడం, జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోవడం.. వంటి పలు కారణాల వల్ల మనలో రాగి లోపం ఏర్పడుతుంటుంది.
రాగి లోపం ఏర్పడితే.. తీవ్రమైన అలసట, అనారోగ్య సమస్యలు తగ్గినట్టే తగ్గి మళ్లీ రావడం, చలిని అసలు ఏమాత్రం తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాగి లోపించడం వల్ల ఆ ప్రభావం నాడీ మండల వ్యవస్థపై కూడా పడుతుంది. దీంతో ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గుదల, సరిగ్గా నడవలేకపోవడం, రన్నింగ్ చేయలేకపోవడం, రక్తహీనత, చర్మం, వెంట్రులు పగిలిపోవడం, చిట్లిపోవడం, కంటి చూపులో సమస్యలు, ఎముకలు బలహీనంగా మారిపోవడం.. వంటి పలు లక్షణాలు కూడా రాగి లోపం వల్ల మనలో కనిపిస్తాయి.
రాగి లోపం నుంచి బయట పడాలంటే రోజూ రాగిపాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగాలి. అలాగే ఆహార పదార్థాలను తినేందుకు రాగి పాత్రలను ఉపయోగించాలి. రాగి పాత్రల్లో వంటలను వండాలి. దీంతో రాగి శరీరానికి లభిస్తుంది. రాగి లోపం నుంచి బయట పడవచ్చు.
రాగి మనకు పలు ఆహారాల వల్ల కూడా లభిస్తుంది. తృణ ధాన్యాలు, టమాటాలు, లివర్, పాలకూర, చేపలు, పప్పు దినుసులు, కొత్తిమీర, నట్స్, విత్తనాల్లో మనకు రాగి అధికంగా లభిస్తుంది. వీటిని కూడా రోజూ తింటుండడం వల్ల రాగి లోపం నుంచి బయట పడవచ్చు. రాగి బాగా లభించి ఆరోగ్యంగా ఉంటారు.