మన శరీరానికి అవసరం అయిన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం కూడా ఒకటి. మన మన శరీరానికి ఆకృతిని ఇచ్చే ఎముకలను, అలాగే దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మనకు కాల్షియం ఎంతో అవసరమవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో కాల్షియం లోపం కారణంగా ఇబ్బంది పడే వారు ఎక్కువవుతున్నారు. కాల్షియం లోపం కారణంగా చిన్న దెబ్బలకే ఎముకలు విరిగడం, చిట్లడం వంటివి జరుగుతూ ఉంటాయి. శరీరంలో కాల్షియం లోపించడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, తిమిర్లు రావడం, చేతులు పటుత్వాన్ని కోల్పోవడం, చేతి గోర్లు పగిలిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
అంతేకాకుండా ఆకలి లేకపోవడం, ఆహారం తినడానికి.. అదే విధంగా మింగడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. శరీరం శక్తిని కోల్పోయినట్టు, ఎప్పుడూ నీరసంగా నిస్సత్తువగా ఉంటుంది. కాల్షియం లోపించడం వల్ల దంతాల సమస్యలు రావడంతోపాటు శరీరంలో రక్తం కూడా గడ్డకడుతుంది. కాల్షియం లోపించడం వల్ల చిన్న పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఈ సమస్య వచ్చాక బాధపడడం కంటే సమస్య రాకుండా చూసుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మనం చాలా సులభంగా కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. కాల్షియం ఎక్కవగా ఉండే ఆహార పదార్థాల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత కాల్షియం లభించడంతోపాటు చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అయితే నువ్వులను మనం నేరుగా తినడం కంటే వాటిని మెత్తగా పొడిగా చేసి ఆ పొడిని నీటిలో కలుపుకుని తాగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు.
రోజూ సాయంత్రం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని కలుపుకుని తాగడం వల్ల మనం చాలా త్వరగా కాల్షియం లోపం అనే సమస్య నుండి బయటపడవచ్చు. ఈ నీటిని తాగలేని వారు నువ్వుల పొడిని తిన్న తరువాత నీటిని తాగాలి. కాల్షియం లోపం మరీ ఎక్కువగా ఉన్న వారు రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని వాడాల్సి ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం లభించి కీళ్లనొప్పులు, దంతాల సమస్యలు, తిమ్మిర్లు రావడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటుతో పాటు షుగర్ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది.
ఈ విధంగా నువ్వుల పొడిని వాడడం వల్ల మన శరీరంలో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. జుట్టు నిగారింపును సొంతం చేసుకుంటుంది. రోజూ సాయంత్రం నువ్వుల పొడిని తీసుకోవడంతోపాటు ఉదయం పూట నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులను, ఒక గ్లాస్ పాలను తాగడం వల్ల మనం చాలా త్వరగా కాల్షియం లోపం నుండి బయట పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.