Iron Foods : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. మన శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేయడంలో హిమోగ్లోబిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ తయారవ్వడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత సమస్య తలెత్తుతుంది. దీనినే అనిమియా అని కూడా అంటారు. రక్తహీనత కారణంగా మనం తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ లోపించడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కడా ఉంటాయి. ఈ సమస్య మన దరి చేరకుండా ఉండాలంటే అలాగే ఈ సమస్య మరింత ఎక్కువగా కాకుండా ఉండాలంటే మనం శరీరంలో ఐరన్ లోపం తలెత్తకుండా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారాల ద్వారా కూడా ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఐరన్ లోపం సమస్య రాకుండా ఉంటుంది.
అసలు మన శరీరంలో ఐరన్ లోపం రావడానికి గల కారణాలను, ఐరన్ లోపం రావడం వల్ల మనలో కనిపించే లక్షణాల గురించి.. అలాగే ఈ సమస్యను అధిగమించడానికి మనం తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ లోపించడం వల్ల తీవ్రమైన అలసటకు గురి అవుతూ ఉంటారు. అలాగే బలహీనత, చికాకు, ఏ పని చేయాలనిపించకపోవడం, ఏ పని పైనా శ్రద్ద పెట్టకపోవడం వంటి లక్షణాలను మనం గమనించవచ్చు. అదే విధంగా ఐరన్ లోపించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే తలనొప్పి, కంటి చూపు మందగించడం, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆత్రుత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపించడం వల్ల థైరాయిడ్ గ్రంథి పని తీరు కూడా మందగిస్తుంది. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి.
రోజుకు ఒక ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవడం వల్ల మనం ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. అలాగే చేపలను తినడం వల్ల కూడా మనం ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. తరచూ చేపలను తినడం వల్ల కూడా ఐరన్ లోపం దరి చేరుకుండా ఉంటుంది. అదేవిధంగా శనగలు, బీన్స్, సోయా బీన్స్ వంటి వాటిలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే పాలకూర, మునగాకును తీసుకోవడం వల్ల కూడా మనం ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. బ్రకోలి, చిలగడదుంప, బఠాణీ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. ఐరన్ లోపంతో బాధపడే వారు వారానికి రెండు సార్లు మాంసాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే తీపి పదార్థాల తయారీలో పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం ఐరన్ లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.
అదే విధంగా ఐరన్ లోపంతో బాధపడే వారు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల ఐరన్ లోపాన్ని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే బాదం పప్పు, పిస్తా పప్పు, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను, పల్లీలను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల కూడా ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. అయితే మనం తీసుకున్న ఆహారంలో ఉండే ఐరన్ మన శరీరానికి అందాలంటే మన శరీరంలో తగినంత విటమిన్ సి ఉండడం కూడా చాలా అవసరం. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ మన శరీరానికి చక్కగా అందుతుంది.