Magnesium Deficiency : మన శరీరానికి తగినన్ని విటమిన్స్, మినరల్స్ ను అందించినప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే చాలా మంది విటమిన్ ఎ, బి, సి, డి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు మన శరీరానికి అందితే సరిపోతుందని అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో మెగ్నీషియం కడా ఒకటి. మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ లో ఇది ఒకటి. కండరాలు మరియు నరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు అనేక రకాల జీవక్రియల నిర్వహణలో కూడా మెగ్నీషియం మనకు సహాయపడుతుంది. విటమిన్ డి వంటి పోషకాలను శరీరం ఉపయోగించుకునేలా చేయడంలో, రక్తనాళాల్లో రక్తప్రవహాన్ని నియంత్రించడంలో మెగ్నీషియం ఎంతో దోహదపడుతుంది.
ఇతర పోషకాల వలె మెగ్నీషియం కూడా మన శరీరానికి ఎంతో అవసరం. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల లక్షణాలను బట్టి మన శరీరంలో మెగ్నీషియం లోపించిందని గుర్తించవచ్చు. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు. శరీరం బలహీనపడినట్టుగా ఉంటుంది. అదే విధంగా ఆకలి తగ్గిపోతుంది. కండరాలు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. మెగ్నీషియం లోపం కండరాల నొప్పులకు కూడా దారి తీస్తుంది. అలాగే శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా తరచూ వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలను బట్టి మన శరీరంలో మెగ్నీషియం లోపించిందని గుర్తించాలి. మెగ్నీషియం లోపాన్ని మనం చాలా సులభంగా అధిగమించవచ్చు. దీనికోసం మనం మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. గోధుమలు, పాలకూర,తోటకూర, రాగులు, సజ్జలు, పెసర్లు, అరటి పండు, డార్క్ చాక్లెట్, పొద్దు తిరుగుడు గింజలు, రాజ్మా వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత మెగ్నీషియం లభిస్తుంది. దీంతో మనం మెగ్నీషియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.