Zinc Foods : పిల్లలు చక్కగా ఎదగడంతో పాటు వారిలో జ్ఞాపక శక్తి ఎక్కవగా ఉండాలని వారు చక్కగా చదువుకోవాలని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వారిలో జ్ఞాపక శక్తి పెరగాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. జ్ఞాపకశక్తి పెరగడానికి మార్కెట్ లో దొరికే రకరకాల పొడులను, లేహ్యాలను పిల్లలకు ఇస్తూ ఉంటారు. ఇలా లేహ్యాలను, పొడులను ఇవ్వడానికి బదులుగా మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలను ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల నేర్చుకునే సామర్థ్యం పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా పెరుగుతుందని వారు చెబుతున్నారు. మూడు రకాల పోషకాలను శరీరానికి అందించడం వల్ల మెదడు పనితీరు చక్కగా పెరుగుతుంది. మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంచే పోషకాలు ఏమిటి.. ఇవి ఏఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడు చక్కగా పని చేయాలన్నా, నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరానికి జింక్, విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ముఖ్యంగా అవసరమవుతాయి. జింక్ లోపించడం వల్ల మెదడు చురుకుగా పని చేయదు. నాడీ కణాల పనితీరు తగ్గుతుంది. జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలల్లో జింక్ లోపించడం వల్ల పుట్టబోయే పిల్లల్లో తెలివితేటలు తగ్గుతాయి. కనుక పిల్లలకు జింక్ ఉండే ఆహారాలను ఎక్కువగా అందించాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడులో కణాలు చక్కగా పని చేస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎక్కువ కాలం పాటు మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా విటమిన్ ఇ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆలోచించేటప్పుడు అనేక రకాల రసాయనాలు విడుదల అవుతాయి. ఈ రసాయనాలు మెదడు కణాల జీవిత కాలాన్ని తగ్గిస్తూ ఉంటాయి.
ఈ రసాయనాలను విచ్చినం చేసి జ్ఞాపకశక్తిని, ఆలోచనా శక్తి పెంచడంలో విటమిన్ ఇ మనకు దోహదపడుతుంది. ఈ మూడు పోషకాలు కలిగిన ఆహారాలను, నట్స్ ను, గింజలను తీసుకోవడంతో పాటు పిల్లలకు ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది. వయసును బట్టి రోజుకు 7 నుండి 10 మిల్లీ గ్రాముల జింక్ మన శరీరానికి ప్రతిరోజూ అవసరమవుతుంది. పొద్దు తిరుగుడు పప్పులో 7 మిల్లీ గ్రాములు, తెల్ల నువ్వుల్లో 8 మిల్లీ గ్రాములు, నల్ల నువ్వుల్లో 8.5 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. వీటిని నానబెట్టి లేదా పొడిగా చేసుకుని తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత జింక్ లభిస్తుంది. అలాగే పిల్లలకు రోజుకు 1 గ్రాము, పెద్దలకు 2 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రోజుకు అవసరమవుతాయి. వాల్ నట్స్ లో 9 గ్రాములు, అవిసె గింజల్లో 13 గ్రాములు, చియా విత్తనాల్లో 18 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. అలాగే మన శరీరానికి రోజుకు 15 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. హజల్ నట్స్ లో 15 మిల్లీ గ్రాములు, బాదం పప్పులో 28 మిల్లీ గ్రాములు, పొద్దు తిరుగుడు విత్తనాల్లో 38 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. ఈ ఆహారాలను పిల్లలకు ఎక్కువగా ఇవ్వడంతో పాటు ప్రాణాయామం చేయించడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాలను అందించడం వల్ల ఎటువంటి పొడులు, లేహ్యాలతో అవసరం లేకుండా పిల్లల్లో మేధాశక్తిని పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.