కాల్షియం పేరు చెప్పగానే సహజంగానే చాలా మందికి ఎముకల ఆరోగ్యం గుర్తుకు వస్తుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం మనకు అవసరమే. రోజూ కాల్షియం ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియంతోపాటు మనకు పలు ఇతర పోషకాలు కూడా అవసరం అవుతుంటాయి. మరి ఆ పోషకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
శరీరం ఒకేసారి పెద్ద మొత్తంలో కాల్షియంను గ్రహించదు. అందువల్ల అధిక మోతాదులో కాల్షియం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. విటమిన్ డి 3, కాల్షియం కలిసిపోతాయి. శరీరంలో విటమిన్ డి 3 స్థాయి తక్కువగా ఉంటే మీరు కాల్షియంను గ్రహించలేరు. విటమిన్ డి 3 కోసం మీరు సూర్యకాంతిలో గడపాలి. చేపలను తినాలి. గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులను తినాలి. దీని వల్ల విటమిన్ డి3 లభిస్తుంది. కాల్షియం సరిగ్గా శోషించుకోబడి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
మెగ్నీషియం, జింక్, విటమిన్ కె 2 మన శరీరానికి అవసరం. విటమిన్ K2 ఎముక సాంద్రతను పెంచడానికి సహాయపడే మరొక ఖనిజం. మీరు సమతుల్య ఆహారం తీసుకుంటే ఇవన్నీ పొందవచ్చు. దీంతో ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
మన ఎముకలకు ప్రోటీన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రోటీన్ ఎముక సాంద్రతను పెంచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ కోసం ఆకుకూరలు, మాంసం, చేపలు, పాలు, పప్పు దినుసులు, బీన్స్, పచ్చి బఠానీలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకుని తినవచ్చు. దీంతో ఎముకలు కూడా ఆరోగ్యంగా మారుతాయి.