Vitamin A Deficiency Symptoms : మన శరీరానికి అవసరం అయిన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఎ కూడా ఒకటి. దీన్నే రెటినాల్ అని కూడా అంటారు. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. విటమిన్ ఎ వల్ల మన శరీరంలో పలు పనులు సక్రమంగా నిర్వహించబడతాయి. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. విటమిన్ ఎ అనేది కొవ్వులో కరిగే పోషక పదార్థం. ఇది కంటి చూపును మెరుగు పరిచి కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ ఎ వల్ల చర్మం డ్యామేజ్ అవకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా విటమిన్ ఎ అవసరమే.
మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేసేందుకు కూడా విటమిన్ ఎ అవసరం అవుతుంది. అలాగే విటమిన్ ఎ వల్ల తెల్ల రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు సైతం తగ్గుతాయి.
విటమిన్ ఎ లోపిస్తే కనిపించే లక్షణాలు..
విటమిన్ ఎ లోపిస్తే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటి చూపు మసకగా మారుతుంది. కొందరికి రాత్రి పూట కనిపించదు. దీన్నే రేచీకటి అంటారు. చర్మం డల్‌గా మారి పొడిగా అవుతుంది. శిరోజాలు రాలిపోతుంటాయి. సంతాన లోపం సమస్య ఏర్పడుతుంది. తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటారు లేదా ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఎముకలు పెళుసుగా మారి సులభంగా విరిగిపోయే దశకు చేరుకుంటాయి.
ఈ లక్షణాలు గనక ఎవరిలో అయినా కనిపిస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో పరీక్షలు చేసి డాక్టర్ తగిన మందులను రాస్తారు. విటమిన్ ఎ లోపాన్ని తగ్గించేందుకు గాను విటమిన్ ఎ ట్యాబ్లెట్లను రాస్తారు. వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. సొంతంగా వాడకూడదు. ఇక విటమిన్ ఎ లోపాన్ని తగ్గించుకునేందుకు మనం తీసుకునే ఆహారంలో కూడా పలు మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, లివర్, చేపల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యారెట్లు, టమాటాలు, చిలగడ దుంపలు, యాపిల్స్, పాలకూర, క్యాప్సికం వంటి వాటిల్లోనూ విటమిన్ ఎ ఎక్కువగానే ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ ఎ లోపం నుంచి బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.