Vitamin A : మన శరీరానికి అవసరం అయిన అనేక రకాల పోషకాల్లో విటమిన్ ఎ ఒకటి. మనకు ఇది ఎంతగానో అవసరం. ఇది కొవ్వులో కరుగుతుంది. కనుక దీన్ని శరీరం నిల్వ చేసుకుని ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఈ విటమిన్ ఉండే ఆహారాలను రోజూ తీసుకోకపోయినా ఫర్వాలేదు. తరచూ తీసుకుంటే చాలు. దీంతో విటమిన్ ఎ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఇక శరీరంలో విటమిన్ ఎ లోపిస్తే అనేక లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు విటమిన్ ఎ అనేక రకాల జీవక్రియలకు అవసరం అవుతుంది. ముఖ్యంగా కణాల పెరుగుదలకు, రోగ నిరోధక శక్తికి, చర్మం, గోళ్లు, శిరోజాల సంరక్షణకు విటమిన్ ఎ అవసరం అవుతుంది. అలాగే కళ్ల ఆరోగ్యానికి కూడా ఈ విటమిన్ పనిచేస్తుంది. ఇక విటమిన్ ఎ లోపిస్తే.. చర్మం పొడిగా మారుతుంది. కంటి చూపు మందగిస్తుంది. దృష్టి లోపం ఏర్పడుతుంది.
విటమిన్ ఎ లోపించడం వల్ల చూపు స్పష్టంగా ఉండదు. మసకగా కనిపిస్తుంది. అలాగే ఎల్లప్పుడూ అలసటగా అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. పెదవులు పగులుతాయి. గాయాలు మానడం ఆలస్యం అవుతుంటుంది. చిన్నారుల్లో అయితే పెరుగుదల లోపం ఏర్పడుతుంది. పెద్దల్లో శ్వాసకోశ వ్యవస్థలో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఇక విటమిన్ ఎ లోపించడానికి అనేక కారణాలు ఉంటాయి.
లివర్ వ్యాధులు ఉన్నవారు, తరచూ మూత్ర విసర్జన అవుతున్న వారు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు, క్యాన్సర్, న్యుమోనియా, కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు.. తదితర సమస్యలు ఉన్నవారిలో విటమిన్ ఎ లోపం అధికంగా ఏర్పడుతుంటుంది. అలాగే పోషకాహార లోపం వల్ల కూడా విటమిన్ ఎ లోపం వస్తుంది. ఇక విటమిన్ ఎ మనకు అనేక రకాల ఆహారాల్లో లభిస్తుంది.
సోయాబీన్, కోడిగుడ్లు, పాలకూర, పాలు, క్యారెట్లు, బొప్పాయి, పెరుగు, తృణ ధాన్యాలు.. వంటి ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల మనకు విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. దీంతో విటమిన్ ఎ లోపం నుంచి బయట పడవచ్చు.