Vitamin B12 : ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జనాభా విటమిన్ బి12 లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ సమస్య సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది తమలో ఈ లోపం ఉన్న విషయాన్ని కూడా గుర్తించలేక పోతున్నారు. భారతదేశంలో దాదాపుగా 74 శాతం మంది ప్రజలు విటమిన్ బి12 లోపంతో ఉన్నారని నివేదికలు తేలుస్తున్నాయి. అంటే కేవలం 26 శాతం జనాభాలో మాత్రమే విటమిన్ బి12 స్థాయిలు తగినంతగా ఉన్నట్టు చెబుతున్నారు.
అయితే ఈ నివేదికలు విటమిన్ బి12 సమస్య తీవ్రతను మాత్రమే కాకుండా మనలో ఈ లోపాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకతను కూడా తెలియజేస్తున్నాయి. లేదంటే దీర్ఘకాలంలో దీని వల్ల మన శరీరానికి కలిగే నష్టాలను తిరిగి భర్తీ చేయలేమని సూచిస్తున్నారు. ఈ విటమిన్ బి12 మన దేహంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంతోపాటు డీఎన్ఏ ను తయారు చేయడంలో కీలకంగా పని చేస్తుంది. ప్రారంభ దశలోనే ఈ లోపాన్ని గుర్తించి సరైన వైద్యం అందించాలని హెచ్చరిస్తున్నారు.
విటమిన్ బి12 లోపం అనేది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కొని తెస్తుంది. యూకేకి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ సంస్థ విటమిన్ బి12 లోపం వల్ల మన శరీరంలో కనిపించే లక్షణాలతో ఒక జాబితా రూపొందించింది. దాని ప్రకారం ఈ లోపం వల్ల చర్మం లేత పసుపు ఛాయలోకి మారడం, నాలుకపై పుండ్లు ఏర్పడటం, నాలుక ఎర్రబడడం, చూపు మందగించడం, నడక కష్టంగా అవడం, వ్యాకులత, ఒత్తిడి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్ బి12 లోపం లక్షణాలు మన శరీరంలోని కాళ్లు, పాదాలు, చేతులు, అర చేతులు మొదలైన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. అరచేతులు, ఇంకా పాదాల్లో మంటలు, సూదులతో గుచ్చినట్టుగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలను బట్టి మనకు విటమిన్ బి12 లోపం ఉన్నట్టుగా భావించవచ్చు. దీనినే ఇంగ్లిష్‌లో పారస్థీషియా అని పిలుస్థారు. రక్తనాళాల్లో ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇంకా నాలుకపై ఎర్రని దద్దుర్లు రావడం, మంటగా ఉండడం, నాలుకపై అల్సర్లు ఏర్పడటం లాంటివి కూడా ఎదుర్కొంటారు. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు అసాధారాణ రీతిలో ఎక్కువ సంఖ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రక్త కణాలు సరిగా పని చేయవు. ఇది ఎనీమియా ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ తగ్గడానికి దారి తీస్తుంది.
మనలో ఈ విధమైన లక్షణాలు కనిపించినపుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, శాకాహారులు, షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ విటమిన్ బి12 లోపం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి. సాధారణంగా విటమిన్ బి12 అనే పోషకం మన శరీరంలో తయారవదు. ఇది మనం తీసుకునే ఆహారం నుండి మన శరీరానికి అందుతుంది. వైద్యుల సలహా మేరకు విటమిన్ బి12ను సప్లిమెంట్ల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చికెన్, గుడ్లు, మాంసం, పాలు, పెరుగు, చీజ్, చేపలు, రొయ్యలు మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే విటమిన్ బి12 లోపం రాకుండా చూసుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.