మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఎముకల దృఢత్వానికి విటమిన్ కె కూడా అవసరం అవుతుంది. కానీ ఈ విటమిన్ గురించి చాలా మందికి తెలియదు. ఇందులోనూ మళ్లీ కె1, కె2 అని రెండు రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ కె1 మనకు ఆకుకూరలు, కూరగాయల ద్వారా లభిస్తుంది. విటమిన్ కె2 కావాలంటే పాలు, పౌల్ట్రీ ఉత్పత్తులను తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ కె కేవలం ఎముకల దృఢత్వానికే కాక, కండరాలను బలంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. విటమిన్ కె మన శరీరానికి లభించాలంటే మనం కొబ్బరినూనె, ఆవనూనె, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలను కూడా నిత్యం తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ కె కొవ్వుల్లో కరుగుతుంది. సదరు నూనెల్లో కొవ్వులు ఉంటాయి. కనుక ఆ నూనెలను తీసుకోవడంతోపాటు విటమిన్ కె ఉండే ఆహారాలను కూడా తీసుకుంటే ఆ విటమిన్ ఆ నూనెల్లో ఉండే కొవ్వుల్లో కరుగుతుంది. ఫలితంగా ఆ విటమిన్ మన శరీరానికి అందుతుంది. కనుక విటమిన్ కె ఉండే ఆహారాలతోపాటు ఆ నూనెలను కూడా నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోనే మనకు విటమిన్ కె లభిస్తుంది.
ఇక విటమిన్ కె ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. త్వరగా గుల్లగా మారకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారితోపాటు ఎముకలు విరిగిన వారు, ఎముకల సంబంధ వ్యాధులు ఉన్నవారు నిత్యం విటమిన్ కె ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడతారు.
విటమిన్ కె మన గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. హైబీపీ తగ్గుతుంది. రక్తం బాగా సరఫరా అవుతుంది. రక్తం గడ్డ కట్టలేని సమస్య ఉన్నవారు విటమిన్ కె ఉండే ఆహారాలను తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కడుతుంది. ఫలితంగా ఎక్కువ రక్తం పోకుండా ఉంటుంది.
విటమిన్ కె మనకు క్యాబేజీ, ఆవాలు, పాలకూర, అవకాడో, కివీ, బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు, ద్రాక్ష, దానిమ్మ పండ్లు, చికెన్, కోడిగుడ్లు, జీడిపప్పు, వాల్‌నట్స్, చేపలు వంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మనకు విటమిన్ కె అందుతుంది. ఫలితంగా పైన తెలిపిన లాభాలు కలుగుతాయి.