గుమ్మడికాయలను చాలా మంది కూరగా చేసుకుని తింటారు. కొందరు వీటితో తీపి వంటకాలు చేసుకుంటారు. అయితే గుమ్మడికాయలు కొందరికి నచ్చవు. కానీ వీటిల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా నిత్యం మనకు కావల్సిన విటమిన్ ఎ గుమ్మడికాయల్లో 200 శాతం ఉంటుంది. అలాగే విటమిన్ సి, ఇ, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6, ఫోలేట్, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు కూడా గుమ్మడికాయల్లో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మనకు పోషణ లభిస్తుంది.
1. గుండె ఆరోగ్యానికి
గుమ్మడికాయల్లో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్‌లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి.
2. అధిక బరువు
గుమ్మడికాయల్లో ఉండే ఫైబర్ అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. గుమ్మడికాయలను తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. తక్కువ ఆహారం తీసుకుంటాం. దీంతో అధిక బరువు తగ్గడం సులభతరం అవుతుంది. వీటిల్లో 90 శాతం నీరే ఉంటుంది. అందువల్ల క్యాలరీలు కూడా తక్కువగా లభిస్తాయి. కనుక అధిక బరువు తగ్గాలనుకునే వారికి గుమ్మడికాయ చక్కని ఆహారం అని చెప్పవచ్చు.
3. కంటి చూపు
గుమ్మడికాయలలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీని వల్ల కంటి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. కంటి రెటీనాకు మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. గుమ్మడికాయల్లో ఉండే లుటీన్, జియాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి.
4. రోగ నిరోధక శక్తి
గుమ్మడికాయల్లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సిలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వైరస్ ల బారి నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
5. చర్మ సంరక్షణ
గుమ్మడికాయల్లో ఉండే బీటా కెరోటిన్ సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ (అతి నీలలోహిత) కిరణాల బారి నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తుంది. గుమ్మడికాయలతో ఫేస్ మాస్క్‌ను తయారు చేసుకుని వాడితే చర్మం సురక్షితంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అందుకు గాను పావు కప్పు గుమ్మడికాయ గుజ్జు, ఒక కోడిగుడ్డు, ఒక టేబుల్ స్పూన్ తేనెలను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి.
6. క్యాన్సర్
గుమ్మడికాయల్లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సి, ఎ, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్లకు కారణం అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. గుమ్మడికాయలను తరచూ తినడం వల్ల ప్రోస్టేట్, ఊపిరి తిత్తుల క్యాన్సర్లు రాకుండా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.
గుమ్మడికాయలను నేరుగా సలాడ్ రూపంలో తిన్నా లేదా కూరగా చేసుకుని తిన్నా, జ్యూస్ రూపంలో సేవించినా పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.