భారతీయుల ఆహారంలో నెయ్యి చాలా ముఖ్యమైంది. పాల నుంచి తయారు చేసే నెయ్యిని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇష్టంగా తింటారు. అనేక ప్రాంతాల్లో నెయ్యిని భిన్న రకాల పేర్లతో పిలుస్తారు.
నెయ్యిలో ఉండే పోషకాలు (5 గ్రాములకు)
- క్యాలరీలు – 44.8
- ప్రోటీన్లు – 0 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు – 0 గ్రాములు
- కొవ్వులు – 4.9 గ్రాములు
నెయ్యిలో మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, ఇ, కె2, డి, కాల్షియం, సీఎల్ఏ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
నెయ్యిని మూడు రకాలుగా విభజించవచ్చు. ఆవు లేదా గేదె పాల నుంచి వెన్న తీసి దాంతో తయారు చేసే సాధారణ నెయ్యి. గిర్ లేదా ఎరుపు రంగు సింధి ఆవుల నుంచి తయారు చేసే ఎ2 నెయ్యి. మూడోది బిలోనా నెయ్యి. అత్యంత స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యినే బిలోనా నెయ్యి అంటారు.
నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు
* ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ నెయ్యి కలిపి రోజూ తాగుతుండాలి. లేదా చిటికెడు పసుపు లేదా మిరియాల పొడితోనూ నెయ్యిని రోజూ తీసుకోవచ్చు. దీంతో జీర్ణవ్యవస్థలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి.
* నెయ్యిని తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* నెయ్యిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
* నెయ్యిలో బ్యుటీరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చక్కని ప్రోబయోటిక్ లా పనిచేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు జరుగుతుంది.
* నెయ్యిలో విటమిన్ కె2 ఉంటుంది. ఇది కాల్షియంను శరీరం శోషించుకునేందుకు సహాయ పడుతుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
* నెయ్యిని రోజూ తీసుకోవడం వల్ల కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
* నెయ్యిని తినడం వల్ల ట్యూమర్ల పెరుగుదలకు అడ్డుకట్ట వేయవచ్చు. కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఆకలి నియంత్రణలో ఉంటుంది.
సూచనలు
* రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో లేదా 5 గ్రాముల మేర మాత్రమే నెయ్యిని తీసుకోవాలి. అంతకు మించరాదు.
* డయాబెటిస్, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ల సూచన మేరకు నెయ్యిని తీసుకోవాలి.
* శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు లేదా వ్యాయామం చేసేవారు రోజుకు 3 నుంచి 4 స్పూన్ల మేర నెయ్యిని తీసుకోవచ్చు.