జుట్టు రాలడం అనేది ప్రస్తుత తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. నిత్యం పెరిగే జుట్టు కన్నా రాలిపోయే జుట్టు ఎక్కువగా ఉంటుంది. దీంతో వెంట్రుకలు రాలే ప్రదేశం అంతా పలుచగా అవుతుంది. అయితే జుట్టు రాలడం తగ్గడంతోపాటు మళ్లీ వెంట్రుకలు పెరగాలంటే.. అందుకు కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
ఐరన్
ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూర, మునగాకు కూర, కోడిగుడ్లలోని పచ్చనిసొన, మాంసం, కిస్మిస్, యాప్రికాట్స్, ఖర్జూరాలు, బ్రొకొలి, పప్పు దినుసులు తినడం వల్ల శిరోజాలు వేగంగా పెరుగుతాయి.
బి-కాంప్లెక్స్
ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, మునగాకు, కోడిగుడ్లు, చికెన్, నట్స్, సీడ్స్‌లలో బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వెంట్రుకల సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్
చేపలు, కోడిగుడ్డు పచ్చనిసొన, వాల్ నట్స్ వంటి పదార్థాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు, చర్మం, గోర్లను సంరక్షిస్తాయి.
విటమిన్ సి
నిత్యం శరీరానికి కనీసం 1000 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ సి అందేలా చూసుకుంటే చాలు.. వెంట్రుకల సమస్యలు ఉండవు. అందుకు గాను ఉసిరికాయలు, జామ పండ్లు, ఎరుపు రంగు క్యాప్సికం, మొలకెత్తిన విత్తనాలు, బ్రొకొలి, స్ట్రాబెర్రీలు, కివీలను తినాల్సి ఉంటుంది.
విటమిన్ డి
విటమిన్ డి ఉండే ఆహారాలను తినడం వల్ల కూడా వెంట్రుకల సమస్యలు ఉండవు. నిత్యం 10 నుంచి 20 నిమిషాల పాటు సూర్య రశ్మిలో గడపడం వల్ల మన శరీరం దానంతట అదే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. లేదా డాక్టర్ సూచన మేరకు నిత్యం కనీసం 1000 ఐయూ మోతాదులో విటమిన్ డి ట్యాబ్లెట్లను వేసుకోవచ్చు. లేదా విటమిన్ డి ఎక్కువగా ఉండే చేపలు, మాంసం, లివర్, కోడిగుడ్డు పచ్చని సొన, తృణ ధాన్యాలు, పచ్చి బఠానీలు, రొయ్యలు, చీజ్, పాలు వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు. దీంతో విటమిన్ డి అందుతుంది. జుట్టు వేగంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.