మనకు అత్యంత చవక ధరలకు అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి చక్కగా పండాలే గానీ ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే అరటి పండ్ల విషయానికి వస్తే నిత్యం ఎన్ని అరటి పండ్లను తినాలని చాలా మంది సందేహిస్తుంటారు. మరి అందుకు న్యూట్రిషనిస్టులు ఏమని సమాధానం చెబుతున్నారంటే..?
ఆరోగ్యవంతమైన వ్యక్తులు నిత్యం 2 నుంచి 3 అరటి పండ్లను తినవచ్చు. అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నప్పటికీ నిత్యం కనీసం 1 పండును తినవచ్చు. అయితే దాన్ని వారు మధ్యాహ్నం భోజనం చేశాక గంట ఆగి తింటే మంచిది. ఇక అరటి పండ్ల వల్ల కలిగే లాభాలు, వాటి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* అరటి పండ్లలో పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు రావు. ఆ జబ్బులు ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే మెదడు కణాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. శరీరంలో నీరు-లవణాలు సమతుల్యంలో ఉంటాయి.
* పొగ తాగేవారు ఆ అలవాటు నుంచి సులభంగా బయట పడేందుకు అరటి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకు పెద్దగా చేయాల్సిందేమీ లేదు. పొగ తాగాలనిపించినప్పుడల్లా ఒక అరటి పండును తింటే చాలు. మాటి మాటికి అలా అనిపిస్తే ఒకటి, రెండు అరటి పండు ముక్కలను తినవచ్చు. ఇలా తరచూ చేస్తుంటే పొగ తాగడం మానేస్తారు. ఆ వ్యసనం నుంచి సులభంగా బయట పడవచ్చు.
* అరటి పండ్లలో బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఆ విటమిన్ల లోపం ఉన్నవారు నిత్యం అరటి పండ్లను తింటే ప్రయోజనం ఉంటుంది.
* అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, కంగారు, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు, కోపం వంటి సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.
* నిత్యం అరటి పండ్లను తినడం వల్ల శరీరంలో సెరొటోనిన్ అనబడే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మూడ్‌ను మారుస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. సంతోషంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది.
* అరటి పండ్లలో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ మన ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని కణాలకు సరఫరా చేస్తుంది.
* జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు అరటి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం ఉన్నవారు నిత్యం వీటిని తింటే ప్రయోజనం ఉంటుంది.
* తీవ్రమైన అలసట, నీరసం ఉన్నవారు, శారీరక శ్రమ చేసి అలసిపోయిన వారు ఒకటి రెండు అరటి పండ్లను తింటే వెంటనే శక్తిని పుంజుకోవచ్చు. మళ్లీ ఉత్సాహంగా మారుతారు.
* అరటి పండ్లను మధ్యాహ్నం లేదా ఉదయం తింటే ఎక్కువ ఫలితం పొందవచ్చు.
* పచ్చి అరటి పండ్లను తినడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.
* బాగా పండిన అరటి పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు వాటిని తినరాదు. ఆరోగ్యవంతులు వాటిని తింటే ఎక్కువ పోషకాలు, శక్తి లభిస్తాయి.