కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా ఉండే ద్రాక్షలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా వీటిని చాలా మంది తింటారు. ఇవి ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. వీటిని ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్ సమయంలోనూ తినవచ్చు. వీటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లకు స్టోర్ హౌజ్‌గా ద్రాక్షలను పిలుస్తారు. వీటిల్లో విటమిన్ సి, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే దాదాపుగా అన్ని రకాల పోషకాలు ద్రాక్షల్లో ఉంటాయి.
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్ల ద్రాక్షల్లో ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ద్రాక్షల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ సి లు ఉంటాయి. ఇవి కళ్లను సంరక్షిస్తాయి. చర్మాన్ని కాపాడుతాయి.
ద్రాక్షల్లో పొటాషియం, కాల్షియం, విటమిన్ ఎ, డిలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ద్రాక్షల్లో అధికంగా ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉండేలా చేస్తుంది.
నిత్యం ద్రాక్షలను తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని టెక్సాస్ వుమెన్స్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు వెల్లడించారు.
ద్రాక్షల వల్ల ప్రయోజనాలు కలగాలంటే నిత్యం వాటిని ఒక కప్పు మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. లేదా వాటితో సలాడ్, జ్యూస్ వంటివి చేసుకుని తాగవచ్చు.
ద్రాక్షల్లో ఉండే రిస్వరెట్రాల్ అనబడే సమ్మేళనం చర్మ సమస్యలను తగ్గిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ద్రాక్షలను తినడం వల్ల మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ రాకుండా ఉంటుంది. శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365