Categories: పండ్లు

రోజూ న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తినండి.. ఈ ప్ర‌యోజనాల‌ను పొందండి..!

న‌ల్ల‌ద్రాక్ష అంటే.. అది పూర్తిగా న‌లుపు రంగులో ఉండ‌దు. వెల్వెట్ రంగులో ఉంటుంది. అయితే ఆకుప‌చ్చ ద్రాక్ష‌తో పోలిస్తే న‌ల్ల‌ద్రాక్ష‌లో పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సుమారుగా 6000 నుంచి 8000 సంవ‌త్స‌రాల కింద‌టే వీటిని సాగు చేశారు. మొద‌ట‌గా ఐరోపాలో వీటిని పండించిన‌ట్లు చెబుతుంటారు. ఇక న‌ల్ల‌ద్రాక్ష‌ల్లోనూ అనేక ర‌కాలు ఉన్నాయి. అయితే వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of black grapes

1. మిచిగాన్ కార్డియోవాస్కులర్ సెంటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం నల్ల ద్రాక్షను తీసుకోవడం వ‌ల్ల మెట‌బాలిక్ సిండ్రోమ్ అనే వ్యాధి త‌గ్గుతుంది. మెట‌బాలిక్ సిండ్రోమ్ వ‌ల్ల ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్ వంటి వ్యాదులు వ‌స్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. ర‌క్తంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) త‌గ్గి ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్‌) పెరుగుతుంది. అలాగే గుండె జ‌బ్బులు వచ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక న‌ల్ల‌ద్రాక్ష‌ను తీసుకోవాలి. దీంతో మెట‌బాలిక్ సిండ్రోమ్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ద్రాక్ష‌ల్లో ఉండే ఫైటోకెమికల్స్ గుండె ఆరోగ్యాన్ని ర‌క్షిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా గుండెపోటు, ఇతర కార్డియో వాస్కులర్ వ్యాధుల ప్రమాదాన్ని త‌గ్గించ‌వచ్చు.

2. నల్ల ద్రాక్షల‌లో లుటీన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కెరోటినాయిడ్ల జాబితాకు చెందుతాయి. కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. అంధత్వం రాకుండా అడ్డుకుంటాయి.

3. న‌ల్ల‌ద్రాక్ష‌ల్లో యాంటీ మ్యుటాజెనిక్‌, యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల అన్ని ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఈ ద్రాక్ష‌ల్లో ఉండే రెస్వెరాట్రాల్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి. కొలరాడో విశ్వవిద్యాలయ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో రెస్వెరాట్రాల్ ప‌లు క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుందని గుర్తించారు.

4. న‌ల్ల‌ద్రాక్షలు మెదడును రక్షించే ఏజెంట్‌గా పనిచేస్తాయి. ఇవి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. న‌ల్ల‌ద్రాక్ష‌ల్లో ఉండే రిబోఫ్లేవిన్ వ‌ల్ల‌ మైగ్రేన్ తో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలోని రెస్వెరాట్రాల్ అల్జీమర్స్ వ్యాధి రోగులలో అమిలోయిడల్-బీటా పెప్టైడ్స్ స్థాయిల‌ని తగ్గిస్తుంది. దీంతో ఆ వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు.

5. మధుమేహ నివారణలో నల్ల ద్రాక్ష కూడా ప్రభావవంతంగా ప‌నిచేస్తుంది. ఇవి ఇన్సులిన్ స్వీక‌ర‌ణ‌ను మెరుగుపరుస్తాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. ద్రాక్షల‌లో ఉండే స్టెరోస్టిల్బీన్ అనే స‌మ్మేళ‌నం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. నల్ల ద్రాక్షల‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఉంటుంది. అందువ‌ల్ల రక్తంలో చక్కెర సమతుల్యతల‌ను ప్రోత్సహిస్తాయి.

6. నల్ల ద్రాక్షల‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి త‌ల‌లో రక్త ప్రసరణకు సహాయపడతాయి. దీంతో అధిక జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్ల‌డం, యుక్త వ‌య‌స్సులో వెంట్రుక‌లు తెల్ల‌బ‌డ‌డం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

7. నల్ల ద్రాక్షల‌లో ఫ్లేవనాయిడ్లు, ఖనిజాలతో పాటు విటమిన్ సి, కె, ఎ లు అధికంగా ఉంటాయి. దీంతో వీటిని తిన‌డం వ‌ల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం, అజీర్ణం, మూత్రపిండాల సమస్యల‌తో బాధ‌ప‌డేవారు న‌ల్ల‌ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

8. నల్ల ద్రాక్షలలో ప్రోయాంతోసైనిడిన్స్, రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి చ‌ర్మానికి రక్షణను అందిస్తాయి. మచ్చలు, ముడ‌తలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఈ ద్రాక్షల‌లోని విటమిన్ సి చర్మ కణాలకు పునరుజ్జీవనం అందిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ ఇ చర్మంలోని తేమను అలాగే ఉంచుతుంది. దీంతో చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన, మెరుస్తున్న చర్మం సొంత‌మ‌వుతుంది.

9. న‌ల్ల‌ద్రాక్ష‌ల్లో ఉండే రెస్వెరాట్రాల్ ఎముకల‌లో సాంద్రతను పెంచుతుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. విరిగిన ఎముక‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts