Custard Apple : చలికాలం సీజన్ ఆరంభం అవుతుందంటే చాలు.. మనకు ఎక్కడ చూసినా సీతాఫలాలు పుష్కలంగా దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తినవచ్చు. ఈ సీజన్‌లో ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే. వీటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సీతాఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.
2. సీతాఫలాల్లో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఒక కప్పు పండును తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ బి6లో దాదాపుగా 24 శాతం వరకు లభిస్తుంది. దీని వల్ల న్యూరోట్రాన్స్‌మిటర్లు ఉత్పత్తి అవుతాయి. సెరొటోనిన్, డోపమైన్‌లను శరీరం ఉత్పత్తి చేస్తుంది. వీటితో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.
3. ఈ పండ్లలో లుటీన్ అనబడే కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. కంటి చూపును పెంచుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తుంది. దీంతో కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
4. హైబీపీ ఉన్నవారు రోజూ ఈ పండ్లను కచ్చితంగా తినాలి. వీటిల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక బీపీ తగ్గాలంటే రోజూ సీతాఫలాలను తినాలి.
5. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
6. సీతాఫలాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది.