Apples : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో యాపిల్స్ ఒకటి. చలికాలంలో ఇవి మనకు తక్కువ ధరకు లభిస్తాయి. అన్ని కాలాల్లోనూ యాపిల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. కానీ చలికాలంలో దిగుబడి అధికంగా వస్తుంది. కనుక ఈ సీజన్ లోనే ఇవి రేటు తక్కువగా ఉంటాయి. అయితే సీజన్లతో సంబంధం లేకుండా యాపిల్స్‌ను రోజూ తినాలి. రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదంటూ చెబుతుంటారు. ఎందుకంటే మన శరీరానికి రోజుకు కావల్సిన పోషకాలు దాదాపుగా యాపిల్స్‌లో అన్నీ ఉంటాయి. కనుకనే రోజుకు ఒక యాపిల్‌ను తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఇక యాపిల్ పండ్లను రోజూ తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
యాపిల్ పండ్లను తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత ఉండదు. అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా యాపిల్స్ ను తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. ఇక 100 గ్రాముల యాపిల్స్‌ను తింటే మనకు సుమారుగా 52 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే 100 గ్రాముల యాపిల్‌లో కొవ్వు 0.2 గ్రాములు, సోడియం 1 మిల్లీగ్రాము, పొటాషియం 107 మిల్లీగ్రాములు, పిండి పదార్థాలు 14 గ్రాములు, ఫైబర్ 2.4 గ్రాములు, ప్రోటీన్లు 0.3 గ్రాములు, విటమిన్ సి 7 శాతం (రోజుకు అవసరం అయ్యే దాంట్లో), మెగ్నిషియం 1 శాతం లభిస్తాయి.
యాపిల్ పండ్లను ఎంతో పురాతన కాలం నుంచే తింటున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం 6500 సంవత్సరాల నుంచే యాపిల్ పండ్లను ప్రజలు తింటున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 7,500 యాపిల్ వెరైటీలు ఉండగా.. వాటిల్లో 2500 వెరైటీలకు చెందిన యాపిల్స్‌ను అమెరికాలోనే పండిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ పండ్ల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో ఉంది. టర్కీ, పోలండ్, ఇటలీలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ పండ్లను యంత్రాలతో కోయరు. ఎక్కడైనా సరే చేతులతోనే కోస్తారు. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ పండ్లను అధికంగా తింటున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ వారు యాపిల్స్‌ను జ్యూస్, సైడర్, సాస్ వంటి రూపాల్లో తీసుకుంటారు.
ఒక్కో అమెరికన్ పౌరుడు సగటున ఏడాదికి 20 కిలోల వరకు యాపిల్ పండ్లను తింటున్నాడని సర్వేలు చెబుతున్నాయి. యాపిల్ పండ్లను నీళ్లలో వేస్తే తేలుతాయి. ఎందుకంటే వాటిల్లో 25 శాతం మేర గాలి ఉంటుంది. యాపిల్ పండ్లను ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పండవు. కానీ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మాత్రం 10 రెట్లు వేగంగా పండుతాయి. కాబట్టి వాటిని తప్పక ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. చాలా వరకు యాపిల్ చెట్లు 4 నుంచి 5 ఏళ్ల తరువాత పండ్లను ఉత్పత్తి చేస్తాయి. కానీ కొన్ని యాపిల్ చెట్లకు పండ్లు పండేందుకు 10 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఇది రకాన్ని బట్టి మారుతుంది. ఒక్కో యాపిల్ చెట్టు సగటున 400 కిలోల వరకు పండ్లను ఉత్పత్తి చేయగలదు.
యాపిల్ పండ్లు వాస్తవానికి గులాబీ మొక్కల జాతికి చెందుతాయి. అలాగే కొన్ని వెరైటీలు పియర్స్, పీచెస్, చెర్రీస్, ప్లమ్స్ జాతులకు కూడా చెందుతాయి. అప్పట్లో యాపిల్ జ్యూస్‌ను ఔషధంగా కూడా డాక్టర్లు ఇచ్చేవారట. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే యాంటీ డిప్రెసెంట్‌గా యాపిల్ జ్యూస్‌ను రోగులకు ఇచ్చేవారట. సాధారణంగా ఒక పెద్ద సైజ్ యాపిల్ పండులో 52 క్యాలరీల వరకు ఉంటాయి. కానీ కొన్ని వెరైటీలు తియ్యగా ఉంటాయి. వాటి ద్వారా సుమారుగా 80 క్యాలరీల వరకు మనకు లభిస్తాయి. యాపిల్ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతోపాటు గుండె జబ్బులు రావని చెబుతుంటారు. కనుకనే రోజుకు ఒక యాపిల్ పండును తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు.