సపోటాలు చాలా తియ్యని రుచిని కలిగి ఉంటాయి. పై భాగం చూస్తే కొందరికి నచ్చదు. కానీ వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. సపోటాలు మనకు తియ్యని రుచిని అందివ్వడమే కాదు, వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. విటమిన్ సి, ఎ
సపోటాల్లో విటమిన్ సి, ఎ లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
2. శక్తి
సపోటాల్లో సహజసిద్ధమైన ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే తక్షణమే శక్తి లభిస్తుంది. అలసిపోయిన వారు, శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారు వీటిని తింటే వెంటనే శక్తిని పుంజుకోవచ్చు.
3. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ
సపోటాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే టానిన్‌లు అనబడే సమ్మేళనాలు సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ పదార్థాల్లా పనిచేస్తాయి. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
4. జీర్ణ ప్రక్రియ
సపోటాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) సమస్య తగ్గుతుంది. సపోటాలు సహజసిద్ధమైన లాక్సేటివ్‌లా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకం సమస్య ఉండదు.
5. యాంటీ ఆక్సిడెంట్లు
సపోటాల్లో ఫైబర్, విటమిన్ ఎ, బి, సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
6. ఎముకల ఆరోగ్యానికి
సపోటాల్లో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. ఈ పండ్లలో ఉండే ఐరన్, ఫోలేట్స్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియంలు ఎముకల పెరుగుదల, నిర్మాణానికి దోహదపడతాయి.
7. హైబీపీ
సపోటాల్లో ఉండే మెగ్నిషియం రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. సపోటాల్లో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.
8. గర్భిణీలకు
గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు సపోటాలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే ఎలక్ట్రోలైట్స్, విటమిన్ ఎ లు వికారం, వాంతికి రావడం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
9. అధిక బరువు
సపోటాలను తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు పోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అలాగే శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఇది బరువును తగ్గించేందుకు సహాయ పడుతుంది.
10. అందానికి
సపోటాలను తరచూ తినడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే సపోటాలను తినడం వల్ల కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ముఖంపై ఉండే ముడతలు తగ్గుతాయి. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.