Sweet Lime : సాధారణంగా బత్తాయి పండ్లను ఎవరూ తరచూ కొనరు. కేవలం ఎవరైనా అనారోగ్యానికి గురైతే లేదా ఎవరినైనా హాస్పిటల్‌లో పలకరించేందుకు వెళితేనే వీటిని కొంటారు. ఎందుకంటే రోగులకు బత్తాయి రసం ఇస్తే మంచిదని, వారు త్వరగా కోలుకుంటారని భావిస్తారు. అందుకనే కేవలం రోగాలు వచ్చినప్పుడు మాత్రమే వీటిని తింటారు. అయితే వాస్తవానికి బత్తాయిలను మనం ఎప్పుడైనా తినాల్సిందే. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా వీటిని రోజూ తినాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బత్తాయి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బత్తాయి పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల మనకు సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. సీజనల్‌గా మనకు దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు వస్తుంటాయి. అయితే సీజనల్‌గా లభించే ఈ పండ్లను తింటే ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. అంతటి శక్తి ఈ పండ్లకు ఉంటుంది. ఇక వీటిల్లో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దీని వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ ఉండవు. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
బత్తాయి పండ్లను తినడం వల్ల శరీరం మొత్తం క్లీన్ అవుతుంది. లివర్, పొట్ట, పేగుల్లో ఉండే వ్యర్థాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. అలాగే కిడ్నీలు కూడా క్లీన్ అవుతాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని ఇవి మెరుగు పరుస్తాయి. అందువల్ల బత్తాయి పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక ఈ పండ్లను తింటే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఇది ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం.
బత్తాయి పండ్లను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా బత్తాయి పండ్లను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక సీజనల్‌గా లభించే వీటిని తినడం మరిచిపోకండి.