పండ్లు ఆరోగ్యానికి మంచివని మనందరీకి తెలుసు. అయితే ఆరోగ్యాన్నిచ్చే పండ్లు అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది యాపిల్. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పండ్లు తీసుకెళ్లే వారు ఎవరైనా సరే మొదటగా యాపిల్స్‌కే ప్రాధాన్యతను ఇస్తుంటారు. యాపిల్ పండ్లలో నిజంగానే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ పండ్లలో గుండెకు మేలు చేసే అంశాలు మరిన్ని ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ పండ్లు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. కంటికి ఇంపుగా కనిపిస్తాయి. అలాగే రుచికరంగా ఉంటాయి. వాటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. యాపిల్ పండ్లలో మొక్కలకు సంబంధించిన రసాయనాలు, ఫ్లేవనాయిడ్లు, పీచు అధికంగా ఉంటాయి. యాపిల్ పండ్లను తొక్కతీసి తింటే ఫ్లేవనాయిడ్లు, పీచును మనం పూర్తి స్థాయిలో పొందలేం. కనుక యాపిల్ పండ్లను తొక్కతోపాటు తినాల్సి ఉంటుంది.
పీచు పదార్థం ఎక్కువగా ఉన్నందున యాపిల్ పండ్లను తింటే మన జీర్ణాశయం నిండుగా ఉన్న భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయడం, వెంటనే ఆహారం తీసుకోవాలనిపించడం వంటి సమస్యలు ఉండవు. అంతే కాకుండా యాపిల్ పండ్లను తినడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. యాపిల్ ద్వారా లభించే పీచులో మలబద్దకాన్ని, విరేచనాలను తగ్గించే శక్తి కూడా ఉంది. రక్తనాళాలకు జరిగే హాని నుండి, గుండె వ్యాధుల నుండి రక్షించే శక్తి సైతం యాపిల్ పండులోని రసాయనాల్లో, దాని తొక్క ద్వారా లభించే పీచులో ఉన్నదని అధ్యయనాలు చెబుతున్నాయి.
యాపిల్ పండ్లలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి సైతం ఉంది. మన శరీర కణాలు ఆక్సిడేషన్ అనే ప్రక్రియకు గురి కాకుండా కూడా యాపిల్ కాపాడుతుంది. కొన్ని రకాల పండ్లు కేవలం సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. కానీ యాపిల్ పండ్లు మాత్రం దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తాయి. వీటిల్లోనూ అనేక రకాల వెరైటీలు ఉంటాయి. అయితే ఏ వెరైటీకి చెందిన యాపిల్‌ను తిన్నా సరే దాదాపుగా ఒకేలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.
యాపిల్ పండ్లలో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల యాపిల్ పండ్లు గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల వల్ల మన శరీరంలోని రక్త నాళాల్లో కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోతుంటాయి. దీంతో గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వంటివి వస్తుంటాయి. అలాగే రక్త నాళాల గోడలు గట్టి పడతాయి. ఇది కూడా స్ట్రోక్స్‌ను కలగజేస్తుంది. కానీ రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల రక్త నాళాల గోడలు గట్టి పడకుండా ఉంటాయి. అలాగే రక్తనాళాల్లో పదార్థాలు పేరుకుపోవు. ఈ విషయాన్ని సైంటిస్టులు తాము చేపట్టిన అధ్యయనాల ద్వారా వెల్లడించారు.
యాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
యాపిల్ పండ్లలో రెండు రకాల ఫైబర్‌లు ఉంటాయి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్. ఇంకొకటి ఇన్ సాల్యుబుల్ ఫైబర్. వీటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. యాపిల్ పండ్లను తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆస్తమా ఉన్నవారికి యాపిల్ పండ్లు మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
యాపిల్ పండ్లను తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయేమోనని డయాబెటిస్ ఉన్నవారు ఆందోళన చెందుతుంటారు. కానీ యాపిల్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి కనుక డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే మేలు చేస్తాయి. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి ఆందోళన చెందకుండా రోజుకు 1 యాపిల్ పండును నిర్భయంగా తినవచ్చు.
యాపిల్ పండ్లలో పెక్టిన్ అనబడే ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలోని ప్రొ బయోటిక్ సూక్ష్మ జీవులకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
యాపిల్ పండ్లను చాలా మంది పొట్టు తీసి తింటుంటారు. కారణం.. క్రిమి సంహారక మందుల అవశేషాలు పొట్టుపై ఉంటాయని భావిస్తుంటారు. కానీ యాపిల్ పండ్లను బాగా శుభ్రం చేస్తే పొట్టుతో సహా తినవచ్చు. దీంతో పొట్టులో ఉండే పాలిఫినాల్స్, పెక్టిన్ వంటివి మనకు లభిస్తాయి. దీంతో పైన తెలిపిన విధంగా ప్రయోజనాలు కలుగుతాయి. అదే పొట్టు తీసి తింటే మనకు కలిగే ప్రయోజనాలను కోల్పోతాం. కనుక యాపిల్ పండ్లను పొట్టుతో తింటేనే మంచిది.
యాపిల్ పండ్లను తినడం వల్ల డిప్రెషన్, ఆందోళన నుంచి బయట పడవచ్చు. శరీరంలో వాపులు తగ్గుతాయి. డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజూ యాపిల్స్‌ను తింటే మేలు చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే యాపిల్‌ను సూపర్ ఫుడ్‌గా డాక్టర్లు చెబుతారు. అందుకనే రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటుంటారు. కాబట్టి రోజూ ఒక యాపిల్‌ను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365