Sunburn : అప్పుడప్పుడూ మనం ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఎండలో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలో బయటకు వెళ్లే చర్మం కందినట్టు అయ్యి తీవ్రమైన బాధను కలిగిస్తుంది. ఎండ ఎక్కువగా తగిలిన భాగంలో చర్మం ఎర్రగా అవ్వడంతో పాటు నొప్పి, మంటను కూడా కలిగిస్తుంది. వివిధ రకాల క్రీములను, ఆయింట్ మెంట్ లను రాసినప్పటికి చర్మ తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది. ఎండలో బయటకు వెళ్లినప్పటికి చర్మం కందిపోకుండా ఉండాలంటే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో, క్యాన్సర్ బారిన పడే అవకాశాలను తగ్గించడంలో, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇలా అనేక విధాలుగా ద్రాక్ష పండ్లు మనకు ఉపయోగపడతాయి. వీటితో పాటు ద్రాక్ష పండ్లను మూడు పూటలా రెండు వారాల పాటు తీసుకున్న వారిపై జరిపిన పరిశోధనల్లో ద్రాక్ష పండ్లు ఎండ నుండి కూడా చర్మాన్ని సంరక్షిస్తాయన్న విషయం వెల్లడైంది. ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకున్న వారి చర్మంపై సూర్యుడు నుండి వచ్చే యువీ కిరణాలు తక్కువ ప్రభావాన్ని చూపాయని పరిశోధనల్లో వెల్లడైంది.
ద్రాక్ష పండ్లల్లో యువీ కిరణాల నుండి రక్షణ కలిగించే ఫైటో కెమికల్స్ తో పాటు రెస్వెరాట్రాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడంతో పాటు చర్మానికి హాని కలగకుండా కాపాడడంలో కూడా సహాయపడుతుంది. ఈ విధంగా ద్రాక్ష పండ్లు ఎండ నుండి చర్మాన్ని కాపాడడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కనుక ద్రాక్ష పండ్లను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వారు తెలియజేస్తున్నారు. అలాగే ద్రాక్షలో కూడా అనేక రకాలు ఉంటాయి. ఎటువంటి ద్రాక్షను తీసుకున్నా కూడా మనం ఈ రకం ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎండలో ఎక్కువగా తిరగాల్సి వచ్చిన వారు ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల చర్మం కందిపోకుండా ఉండడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.