కరోనా నేపథ్యంలో పిల్లలు గత ఏడాదిన్నర కాలంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో వారు ఎక్కువ సమయం పాటు ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ట్యాబ్‌ల ఎదుట కాలం గడుపుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. దీంతో పాటు గేమ్స్ ఆడడం ఎక్కువైంది. అయితే ఈ విధంగా చేయడం వల్ల వారి కళ్లను నష్టం కలుగుతుంది. కంటి చూపు దెబ్బ తింటుంది. కళ్లు పొడిగా మారి కంటి సమస్యలు వస్తాయి. కనుక పిల్లల కళ్లను రక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఏర్పడింది. అయితే కింద తెలిపిన ఆహారాలను వారికి రోజూ ఇవ్వడం వల్ల వారి కళ్ల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచవచ్చు. దీంతో కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. మరి పిల్లల కళ్ల సంరక్షణ కోసం వారికి రోజూ ఇవ్వాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. క్యారెట్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. అందువల్ల వాటిని తింటే శరీరంలో అది విటమిన్ ఎ గా మారతుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను సంరక్షిస్తుంది. కనుక పిల్లలకు రోజూ క్యారెట్లను ఇవ్వాలి.
2. బచ్చలికూర, ఇతర ఆకుకూరలల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆకుకూరల్లో ఉండే లుటిన్, జియాక్సంతిన్ లు కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. కనుక ఆకుకూరలను కూడా పిల్లలకు రోజూ తినిపించాలి.
3. కంటి ఆరోగ్యానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మేలు చేస్తాయి. ఇవి చియా సీడ్స్, అవిసె గింజలు, వాల్ నట్స్, కోడిగుడ్ల, బాదంపప్పు వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని పిల్లలకు రోజూ ఇస్తే కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
4. క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కళ్ళలోని రక్త నాళాలకు మేలు చేస్తుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎరుపు రంగు క్యాప్సికం తినడం వల్ల విటమిన్ ఎ, ఇ లభిస్తాయి. ఇవి కళ్లను సురక్షితంగా ఉంచుతాయి. కాబట్టి పిల్లలకు క్యాప్సికంను కూడా అందించాలి.
5. చిలగడదుంపలలో క్యారెట్ మాదిరిగానే విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని పిల్లలకు తరచూ ఇస్తుండాలి.
6. పైనాపిల్స్‌లో విటమిన్ సి ఉంటుంది. దీని వల్ల కళ్లలో శుక్లాలు ఏర్పడవు. కళ్లు సురక్షితంగా ఉంటాయి.
7. డ్రై ఆప్రికాట్లు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వాటిలో విటమిన్లు ఎ, సి, ఇ, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి రెటీనా భాగాన్ని కాపాడుతాయి. దీని వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి.
8. బెండకాయల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. పిల్లలు వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ఎలాగోలా తినిపించాలి. దీని వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
9. బ్రోకలీలో లుటీన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి రెటీనాను సంరక్షిస్తాయి. బ్రోకలీని రోజూ పిల్లలకు తినిపిస్తే కళ్ల ఆరోగ్యంగా సురక్షితంగా ఉండడంతోపాటు ఎన్నో పోషకాలు లభిస్తాయి. వారు ఆరోగ్యంగా ఉంటారు.
10. పర్పుల్ కలర్‌లో ఉండే క్యాబేజీలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. మాక్యులర్ క్షీణత, కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల తరచూ పిల్లలకు పర్పుల్ కలర్ క్యాబేజీని తినిపించాలి. దీంతో కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365