Horse Gram : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనల్ని అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుందా ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్, అధిక బరువు, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, గుండె సంబంధిత సమస్యలు, మూత్రసంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతున్నాం. మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉలవలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఉలవల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఇవి టానిక్ లా పని చేస్తాయి. వీటిని వేయించి, ఉడికించి, మొలకలుగా చేసి ఎలాగైనా తీసుకోవచ్చు. ఉలవల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆకలిని పెంచడంలో, కఫాన్ని తగ్గించడంలో ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి. కళ్ల నుండి నీరు ఎక్కువగా కారుతున్నప్పుడు ఉలవలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అలాగే ఇతర మూత్రసంబంధిత సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు ఉలవలను తినడం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి. అలాగే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తిసడం వల్ల అజీర్తి, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఉలవలను ఉడికించి లేదా వాటితో చారును చేసుకుని తినడం వల్ల అన్ని వయసుల వారిలో వచ్చే స్థూలకాయం సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.
ఉలవలతో ఉలవ కట్టు తయారు చేసుకుని తాగడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఒక కప్పు ఉలవలను నానబెట్టాలి. తరువాత వీటిని ఒక కుక్కర్ లో తీసుకుని అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉలవలను మెత్తగా ఉడికించాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిలో తగినంత ఉప్పు వేసి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. ఉలవలను ఆహారంగా తీసుకునేటప్పుడు శరీరంలో మంటగా ఉంటే మజ్జిగను తాగాలి. ఉలవలను, బియ్యాన్ని కలిపి జావగా తయారు చేసుకోవాలి. వీటికి పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే లైంగిక సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉలవలను కళాయిలో వేసి వేడి చేయాలి. తరువాత వీటిని కాటన్ వస్త్రంలో వేసి మూట కట్టాలి. తరువాత ఈ మూటతో శరీరంలో నొప్పిగా, వాపుగా ఉన్న చోట కాపడం పెట్టుకోవడం వల్ల నొప్పులు , వాపులు తగ్గుతాయి.
ఉలవల్లో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. 100 గ్రాముల ఉడికించిన ఉలవల్లో 321 క్యాలరీల శక్తి, 22 గ్రాముల ప్రోటీన్లు, 57 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 280 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 313 మిల్లీ గ్రాముల ఫాస్ఫరస్, ఫైబర్ ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఉలవలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.