Chia Seeds In Telugu : చియా విత్తనాలు.. ఇవి చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. కానీ ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. చియా విత్తనాలను ప్రస్తుత తరుణంలో చాలా మంది తింటున్నారు. వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. చియా విత్తనాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల చియా విత్తనాలను తింటే 486 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 16.5 గ్రాములు, కొవ్వులు 30.7 గ్రాములు, పిండి పదార్థాలు 42.1 గ్రాములు, ఫైబర్ 34.4 గ్రాములు, క్యాల్షియం 631 మిల్లీగ్రాములు లభిస్తాయి. అందువల్ల చియా విత్తనాలను పోషకాలకు గనిగా చెప్పవచ్చు.
చియా విత్తనాలలో ఐరన్ కూడా సమృద్ధిగానే ఉంటుంది. వీటిని తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. చియా విత్తనాల్లో అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్లు, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు, క్యాల్షియం, మెగ్నిషియం ఉంటాయి. అందువల్ల చియా సీడ్స్‌ను తింటే మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటాం. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.
గుండె జబ్బులు రావు..
చియా సీడ్స్‌లో ఉండే క్వర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. ఫలితంగా కణాలు డ్యామేజ్ అవకుండా చూసుకోవచ్చు. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇక చియా విత్తనాల్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బీపీని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల హైబీపీ ఉన్నవారికి ఈ విత్తనాలు వరమనే చెప్పవచ్చు.
ఇక చియా విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చియా విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉండడం వల్ల శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. కనుక కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు తరచూ తమ ఆహారంలో చియా విత్తనాలను చేర్చుకోవాలి. అలాగే ఈ విత్తనాలను తినడం వల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఈ విత్తనాల్లో ఉండే ఆల్ఫా-లినోలినిక్ యాసిడ్ (ఏఎల్ఏ) గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ఎముకలకు బలం..
ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఏఎల్ఏ వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే హైబీపీ, వాపులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. కనుక చియా విత్తనాలను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ విత్తనాల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కనుక వీటిని తింటే ఎముకలు దృఢంగా మారుతాయి. ఈ విత్తనాల్లో ఉండే ఫాస్ఫరస్, మెగ్నిషియం కూడా ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.
చియా విత్తనాలను తింటే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. చియా విత్తనాల్లో ఉండే ఏఎల్ఏ ఎముకల సాంద్రతను పెంచుతుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విత్తనాల్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది. అలాగే జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల మనకు పోషకాహార లోపం తలెత్తదు.
అధిక బరువుకు..
ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ మనకు కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా మనం ఆహారం తక్కుగా తింటాం. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారు రోజూ చియా విత్తనాలను తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. కనీసం రోజుకు 14 గ్రాముల చియా విత్తనాలను రోజూ తింటే తప్పక ఫలితం ఉంటుందని సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది. ఇక ఈ విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండడం, వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఇవి షుగర్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
చియా విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ముఖ్యంగా డీహెచ్ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరిచి మెదడు యాక్టివ్‌గా ఉండేలా చూస్తుంది. దీంతో చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. చియా విత్తనాల్లో ఉండే అనేక రకాల మినరల్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. దీంతో శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఇలా చియా విత్తనాలతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ నీటిలో నానబెట్టి తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.