Almonds : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. బాదంపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. ప్రతిరోజూ బాదంపప్పును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజూ బాదంపప్పును తీసుకునే వారు దీనిని ఎలా తీసుకోవాలి.. ఎంత మోతాదులో తీసుకోవాలి..అని కూడా తెలుసుకోవాలి. బాదంపప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. బాదంపప్పును తగిన మోతాదులో సరైన పద్దతిలో తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు, క్యాన్సర్ వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
మన ఆరోగ్యానికే కాదు మన చర్మానికి, జుట్టుకు కూడా ఈ బాదంపప్పు ఎంతో మేలు చేస్తుంది. బాదంపప్పును తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ బాదంపప్పులో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాపర్, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం రోజుకు 12 నుండి 15 బాదంపప్పులను తీసుకోవాలి. వీటిని మొదటిసారిగా తీసుకునే వారు మొదటి రోజు 4 నుండి 5 బాదంపప్పులను తీసుకుని ఆ తరువాత ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ బాదంపప్పులను నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. దీని కోసం రాత్రిపూటనే బాదంపప్పును నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసుకుని తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. బాదంపప్పు సులభంగా జీర్ణమవుతుంది.
ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల బాదంపప్పులో ఉండే పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. గర్బిణీ స్త్రీలు తప్పకుండా ఈ బాదంపప్పును నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. ఇవలా తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు పోషకాలు చక్కగా అందుతాఇ. ఈ బాదంపప్పును చెప్పిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ బాదంపప్పును ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అయితే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు మాత్రం వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. బాదంపప్పులో ఆక్సలైట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింతగా పెంచే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకోవడానికి ముందే నానబెట్టిన బాదంపప్పును తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే బరువు పెరగాలనుకునే వారు పాలు, బాదంపప్పును కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా తగిన మోతాదులో నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.