Almonds : బాదంపప్పు.. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇది కూడా ఒకటి. బాదంపప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిరోజూ బాదంపప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. బాదంపప్పును తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఎముకలు బలంగా, ధృడంగా తయారవుతాయి. ఆర్థోపోరోసిస్ వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
బాదంపప్పును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ చక్కగా అందుతాయి. బాదంపప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి వేసవికాలంలో వీటిని తీసుకోవాలా వద్దా అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. బాదంపప్పు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. వీటిని వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో మరింత వేడి చేస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే వేసవికాలం అయినప్పటికి కాలంతో సంబంధం లేకుండా బాదంపప్పును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పు వేడి చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పటికి వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగిఉన్నాయి. కనుక వేసవికాలంలో కలిగే నీరసం నుండి మనల్ని కాపాడడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఎండ వల్ల చర్మం దెబ్బతిన్నకుండా చేయడంలో కూడా ఈ బాదంపప్పు మనకు సహాయపడుతుందని వారు చెబుతున్నారు. అలాగే ఈ బాదంపప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మరోసారి శుభ్రంగా కడిగి వాటిపైఉండే పొట్టును తీసేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బాదంపప్పు సులభంగా జీర్ణమవుతుంది. వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి.ఇలా బాదంపప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. అదే విధంగా మన వయసు, మన శరీర అవసరాలను బట్టి మనం రోజుకు 1 నుండి 28 గ్రాముల వరకు బాదంపప్పును తీసుకోవచ్చని వారు చెబుతున్నారు. వేసవికాలం అయినప్పటికి బాదంపప్పును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదని వారు చెబుతున్నారు.