Cashew Nuts : జీడి పప్పు.. ఈ పేరు వినగానే మనకు అతి మధురమైన దీని రుచే గుర్తుకు వస్తుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వంటకాల్లో అలాగే నేరుగా దీనిని తింటూ ఉంటాం. చాలా మంది దీనిని తినడానికి భయపడతారు. దీనిని తినడం వల్ల శరీరంలో గుండె జబ్బులు వస్తాయని, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చాలా మంది అపోహపడుతుంటారు. అయితే ఈ జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదని దీనిని తినడం వల్ల గుండెకు ఎటువంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల జీడిపప్పులో 47 గ్రాముల కొవ్వు ఉంటుంది. మనలో తెలియక చాలా మంది కొవ్వు, కొలెస్ట్రాల్ ఒకటే అని అనకుంటున్నారు. కానీ కొవ్వు వేరు, కొలెస్ట్రాల్ వేరు అని నిపుణులు సూచిస్తున్నారు.
రోజుకు మన శరీరానికి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. ఇది శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి, బైల్ జ్యూస్ తయారీకి, విటమిన్ డి తయారీకి ఈ కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. కొవ్వు మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి అవసరమవుతుంది. మనం చేసే పనిని బట్టి, వ్యాయామాన్ని బట్టి ఈ కొవ్వును మన శరీరం ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాల్లో పేరుకుపోయి గుండె జబ్బులకు దారి తీస్తుంది. జీడిపప్పులో ఉండే కొవ్వు ఆరోగ్యకరమైన కొవ్వు. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగదు. 100 గ్రాముల జీడిపప్పులో 21 గ్రాముల ప్రోటీన్లు, 5 మిల్లీ గ్రాముల ఐరన్, 500 మిల్లీ గ్రాముల ఫాస్పరస్ ఉంటాయి.

అలాగే వీటిని తీసుకోవడం వల్ల 596 క్యాలరీల శక్తి వస్తుంది. జీడిపప్పు బలానికి పెట్టింది పేరు. ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి ఈ జీడిపప్పును శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుతో బాధపడే వారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక అప్పుడప్పుడూ అది కూడా 5 లేదా 6 జీడిపప్పుల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. షుగర్ వ్యాధి ఉన్న వారు ఈ జీడిపప్పును తీసుకోవచ్చు. అయితే షుగర్ వ్యాధి ఉండి సన్నగా, నీరసంగా ఉన్న వారు మాత్రమే వీటిని ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ వ్యాధి ఉండి లావుగా ఉన్న వారు ఈ జీడిపప్పును తక్కువగా తీసుకోవాలి. పిల్లలు, కండ పట్టడం కోసం వ్యాయామాలు చేసే వారు, క్రీడల్లో పాల్గొనే వారు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు ఈ జీడిపప్పును ఎక్కువగా తీసుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన మంచి ఆహారాల్లో జీడిపప్పు ఒకటి.
కనుక దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. అయితే జీడిపప్పును ఎలా పడితే అలా తినకూడదు. రుచిగా ఉంటుంది కదా అని చాలా మంది దీనిని నెయ్యిలో వేయించుకుని ఉప్పు, కారం, మసాలాలు చల్లుకుని తింటూ ఉంటారు. అలా గనుక జీడిపప్పును తింటే మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇలా తింటే శరీరానికి మేలు చేసే జీడిపప్పు హానిని కలిగిస్తుంది. ఈ జీడిపప్పును నీటిలో నానబెట్టుకుని తినడం వల్ల మాత్రమే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇలా తినడం వల్ల మాత్రమే మనం జీడిపప్పులోని పోషకాలను దాని వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.