Health Tips : వయసు పెరుగుతున్న కూడా చర్మం యవ్వనంగా కనబడాలని మనలో చాలా మంది కోరుకుంటుంటారు. ఈ మధ్య కాలంలో ఇలా యవ్వనంగా కనబడడానికి చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. మార్కెట్ లో దొరికే ప్రతి సౌందర్య సాధనాన్ని తెచ్చుకొని వాడుతున్నారు. సౌందర్య ఉత్పత్తుల ద్వారా కాకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మనం యవ్వనాన్ని పెంచుకోవచ్చు. మనం తీసుకునే ఆహారాల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ శరీరంలోని కణాన్ని, అవయవాన్ని, చర్మాన్ని కూడా వయసు తక్కువగా కనబడేలా చేస్తుంది. శరీరంలో కణాలు ఆరోగ్యంగా ఉంటే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవయవాలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటాం. కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటిపై ఉండే పొర ఆరోగ్యంగా ఉండాలి. కణాల పై పొరను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ ఇ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
అలాగే కణాల్లో ఉండే మైటో కాండ్రియా మనం తిన్న ఆహారం నుండి శక్తిని విడుదల చేస్తాయి. ఈ మైటో కాండ్రియాలు ఆరోగ్యంగా ఉండడానికి, ఎక్కువ కాలం పని చేయడానికి కూడా విటమిన్ ఇ చాలా అవసరం. ఈమైటో కాండ్రియా ఆరోగ్యంపైనే కణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అదే విధంగా చర్మం లోపలి పొరల్లో ఉండే కొలాజెన్ చర్మాన్ని ముడతలు పడకుండా చేయడంలో సహాయపడుతుంది. ఈ కొలాజెన్ తయారవడానికి విటమిన్ ఇ చాలా అవసరం. శరీరానికి తగినంత విటమిన్ ఇ అందడం వల్ల కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఇక సూర్యుడి నుండి కిరణాలు నుండి చర్మాన్ని కాపాడడంలో విటమిన్ ఇ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదే విధంగా కణాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గా విటమిన్ ఇ మనకు సహాయపడుతుంది.

వయసు పెరిగిన కూడా మనం ఆరోగ్యంగా, యవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలంటే మన శరీరానికి విటమిన్ ఇ చాలా అవసరం. మన శరీరానికి ప్రతిరోజూ 15 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజుకు 19 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. ఈ విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో బాదం పప్పు ఒకటి. 100 గ్రాముల బాదం పప్పులో 28 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. అలాగే పొద్దు తిరుగుడు గింజల్లో కూడా విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వాడడానికి బదులుగా ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల వయసు పెరిగినప్పటికి మనం యవ్వనంగా కనబడతామని నిపుణులు చెబుతున్నారు.