మొలకలను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. కానీ మొలకలు చాలా బలవర్ధకమైన ఆహారం. బరువు తగ్గాలని చూసే వారితోపాటు అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిత్యం తీసుకోదగిన ఆహారం మొలకలు. కొద్దిగా శ్రమిస్తే ఇంట్లోనే మొలకలను తయారు చేసుకోవచ్చు. అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పల్లీలు (వేరు శెనగలు) లేదా పెసలు లేదా శనగలు లాంటి గింజలతో మొలకలు తయారు చేసుకోవచ్చు. లేదా అన్నింటినీ కలిపి కొంత మోతాదులో తీసుకుని వాటితో మొలకలు తయారు చేయవచ్చు.
గింజలను ముందుగా 8 నుంచి 10 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత వాటిని నీటి నుంచి తీసేసి శుభ్రమైన వస్త్రంలో ఉంచి చుట్టి ముడివేయాలి. అనంతరం 24 గంటల నుంచి 48 గంటల్లోగా మొలకలు తయారవుతాయి. మనం ఎంచుకునే గింజలను బట్టి అవి ఏర్పడుతాయి. పెసలు అయితే త్వరగా మొలకలుగా మారుతాయి. అయితే వస్త్రంలో చుట్టలేకపోతే ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో గింజలను ఉంచి దానిపై మూత పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మొలకలను తయారు చేసుకోవచ్చు.
* మొలకల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. భిన్న రకాల గింజలతో మొలకలను చేసుకుని తింటే మంచిది. దీంతో అనేక పోషకాలను పొందవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫోలేట్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, విటమిన్ లు సి,కె వంటివి మనకు మొలకల ద్వారా లభిస్తాయి. ఇవి శరీరానికి పోషణను, శక్తిని అందిస్తాయి.
* మొలకల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
* డయాబెటిస్‌తో బాధపడేవారు మొలకలను తింటే ప్రయోజనం కలుగుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
* మొలకల్లో ఫైబర్ (పీచు పదార్థం) సమృద్ధిగా ఉంటుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గవచ్చు. జీర్ణ సమస్యలు ఉండవు.
* మొలకల్లో ఉండే పోషకాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
మొలకల్లో బాక్టీరియా ఉంటుంది. అందువల్ల కొందరిలో ఇన్‌ఫెక్షన్లు ఏర్పడుతాయి. కనుక వాటిని పెనంపై కొద్దిగా వేయించి తీసుకోవచ్చు. అవసరం అనుకుంటే రుచి కోసం వాటిలో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. దీంతో అదనపు పోషకాలు కూడా అందుతాయి. అలాగే మొలకలతో కూర చేసుకుని తినవచ్చు. పండ్లతో కలిపి సలాడ్‌ల రూపంలోనూ తినవచ్చు. మొలకలు జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది కనుక ఉదయం అల్పాహారంలో కొద్ది మోతాదులో వీటిని తీసుకోవచ్చు. లేదా వ్యాయామం చేశాక తీసుకోవచ్చు.