Healthy Snacks : మనం ఆరోగ్యంగా ఉండాలంటే భోజనాన్ని సమయానికి తీసుకోవడం కూడా ఎంతో అవసరం. అలాగే మధ్య మధ్యలో మనం తినే ఆహారాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో, బయట ఎక్కడున్నా సరే లంచ్ కి, డిన్నర్ కి మధ్య ఉండే సాయంత్రం సమయంలో కొద్దిగా స్నాక్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే ఆకలి ఉన్నప్పుడు స్నాక్స్ తినడం మంచిదే. కానీ అన్ని రకాల స్నాక్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ ను మాత్రమే ఆహారంగా ఎంచుకోవాలి. ఎటువంటి వాటిని స్నాక్స్ గా తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఆపిల్ ఒకటి. ఇది అందరికీ తెలిసిందే. ఆపిల్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిని స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఆపిల్ ను తినడం వల్ల శక్తి లభించడంతోపాటు ఆకలి భావన కూడా తగ్గుతుంది. అలాగే పాప్ కార్న్ ను కూడా మనం స్నాక్స్ గా తీసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన స్నాక్ గా పని చేస్తుంది. పాప్ కార్న్ ను తినడం వల్ల చాలా రకాల ఫైబర్ లు శరీరానికి లభిస్తాయి. కొవ్వు పదార్థాలను లేని ఒక గిన్నె నిండా ఉండే పాప్ కార్న్ ను తినడం వల్ల 20 క్యాలరీల శక్తిని పొందవచ్చు.
అదే విధంగా డ్రై నట్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. అధికంగా పని చేసి ఒత్తిడికి గురి అవుతున్న సమయంలో డ్రైనట్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు శరీరానికి కూడా శక్తి లభిస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన అన్ సాచ్యురేటెడ్ ప్యాట్ ను కలిగి ఉంటాయి. వీటిని స్నాక్స్ గా తీసుకోవడం వల్ల శరీరానికి మేలే తప్ప హాని కలగదు. మనం స్నాక్స్ గా పచ్చి కూరగాయల జ్యూస్ ను కూడా తీసుకోవచ్చు. ఆకుపచ్చని కూరగాయలు శక్తిని పెంచుతాయి. వీటిని నేరుగా తీసుకున్నా జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా ఒకే రకమైన శక్తి లభిస్తుంది. ఇవి త్వరగా జీర్ణమవ్వడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
అదేవిధంగా స్నాక్స్ గా మనకు నచ్చిన పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ఈ పండ్లను మిల్క్ షేక్, స్మూతీల రూపంలో తీసుకోవడం ఇంకా మంచిది. ఉడికించిన కోడిగుడ్లను కూడా మనం స్నాక్స్ గా తీసుకోవచ్చు. కోడిగుడ్డులో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఆకలి ఉన్నప్పుడు లేదా పని చేస్తూ వీటిని స్నాక్స్ గా తీసుకోవచ్చు. అదే విధంగా ఫ్రూట్ సలాడ్ ను తయారు చేసుకుని కూడా మనం స్నాక్స్ గా తీసుకోవచ్చు. తాజా పండ్లతో సలాడ్ ను చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవి శక్తిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
వీటితో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే స్నాక్ ను ఎలా తయారు చేసుకోవాలో అసలు ఆ స్నాక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని పెరుగు, టమాటాతో తయారు చేస్తారు. ఇవి రెండు కూడా ఆరోగ్యకరమైనవే. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎంతో కొంత మార్పును మనం చూడవచ్చు. టమాటాలోని లైకోపిన్ అనే పదార్థం క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ స్నాక్ ను తయారు చేసుకోవడానికి గాను ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప పప్పును వేసి తాళింపు చేసుకోవాలి. అవి వేగాక టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును, కొద్దిగా పసుపును, తగినంత ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపు కోవాలి. తరువాత దీనిలో ముందుగా వేయించిన టమాట ముక్కల మిశ్రమాన్ని వేసి కలపాలి. తరువాత కొద్దిగా కొత్తిమీరను చల్లాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే టమాట పెరుగు చట్నీ తయారవుతుంది.
దీనిని సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. స్నాక్స్ రూపంలో సోడా, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తీసుకోవడం వల్ల క్యాలరీలు లభిస్తాయి. కానీ పోషకాలు లభించవు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. కాబట్టి అనారోగ్యానికి గురి చేసే స్నాక్స్ ను కాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే స్నాక్స్ ను ఎంచుకోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.