Broccoli : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బ్రకోలి కూడా ఒకటి. ఇది చూడడానికి ఆకుపచ్చని క్యాలీప్లవర్ లా ఉంటుంది. విదేశాల్లో దీనిని ఎక్కవగా ఆహారంగా తీసుకుంటారు. ప్రస్తుత కాలంలో మన దగ్గర కూడా దీని వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. సూపర్ మార్కెట్ లలో, రైతు బజార్ లలో బ్రకోలి విరివిరిగా లభిస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ ఎ, రైబో ప్లేవిన్, విటమిన్ బి 2, విటమిన్ బి 6, విటమిన్ బి 9, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లు ఉంటాయి. అలాగే పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సెలెనియం, మాంగనీస్, క్రోమియం వంటి పోషకాలతో పాటు పీచు పదార్థాలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ వంటి పోషకాలు కూడా బ్రకోలీలో అధికంగా ఉంటాయి.
బ్రకోలీని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రకోలీని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ్రకోలి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు బ్రకోలీని తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక బరువు, స్థూలకాయం సమస్యతో బాధపడే వారు బ్రకోలీని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే బ్రకోలిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో, వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రాకుండా చేయడంలో కూడా బ్రకోలి మనకు సహాయపడుతుంది.
దంతాలను, ఆరోగ్యంగా ఉంచడంలో, చిగుళ్ల నుండి రక్తం కారడం, దంత క్షయం, నోటి దుర్వాసన వంటి సమస్యలను అరికట్టడంలో కూడా బ్రకోలి మనకు దోహదపడుతుంది. అలాగే స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో కూడా బ్రకోలి దోహదపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా బ్రకోలి సహాయపడుతుంది. అదే విధంగా శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నిరోధించి రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా చేయడంలో కూడా బ్రకోలి మనకు ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారు బ్రకోలిని తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.
బ్రకోలిని ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. వృద్ధాప్యంలో అల్జీమర్స్, మతిమరుపు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రేచీకటి సమస్య తగ్గుతుంది. ఈ విధంగా బ్రకోలి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.