Potatoes : సాధారణంగా ఆలుగడ్డలను తినడం వలన బరువు పెరుగుతామని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే అందులో కొంత వరకే నిజం ఉంది. బరువు పెరగకూడదని ఆలుగడ్డలను తినడం మానేస్తే దాని ద్వారా మనం బరువు తగ్గడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలను కోల్పోవలసి వస్తుంది. అయితే ఆలుగడ్డలను మనం ఏ రూపంలో తింటున్నాం అనేది మన బరువు పెరగడం లేదా తగ్గడాన్ని నిర్ణయిస్తుంది. కేవలం ఆలుగడ్డలను తినడం వలన బరువు పెరుగుతామనేది ఒక అపోహే అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
అంతే కాకుండా ఆలుగడ్డలను ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చిప్స్ రూపంలో తినడం హానికారకం అనీ, ఉడికించిన ఆలుగడ్డలను తినడం వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయని సలహా ఇస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి ఆలుగడ్డలను ఇంకా ఏ విధంగా తీసుకుంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అందరూ అనుకుంటున్నట్లుగా ఆలుగడ్డలలో ఎక్కువ క్యాలరీలు ఉండవు. ఉడికించిన ఆలుగడ్డలు ఎప్పుడూ ఆరోగ్యకరమే. ఎప్పుడైతే వాటిని వేయించిన రూపంలో తీసుకుంటామో అప్పుడే అవి అతిగా నూనెను పీల్చుకుని అధిక క్యాలరీలను మోసుకుని వస్తాయి. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వెడ్జెస్ ఇలా రకరకాలుగా వేయించుకొని తినడం మనం చూస్తూనే ఉంటాం. నిజానికి ఆలుగడ్డలలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.
10 గ్రాముల ఆలుగడ్డలలో కేవలం 10 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక కప్పు ఉడికించిన ఆలుని తిన్నప్పుడు 100 క్యాలరీలు మాత్రమే పొందుతాము. అంతే కాకుండా మన పొట్ట కూడా త్వరగా నిండిన అనుభూతి కలుగుతుంది. ఇంకా ఆలుగడ్డ తొక్కలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. బేబీ పొటాటో ఇంకా ఎర్రని ఆలుగడ్డలను తొక్కతో పాటే తినవచ్చు. పీచు పదార్థం జీర్ణక్రియను పెంచడంలో, బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే.
అంతే కాకుండా ఉడికించిన ఆలుగడ్డలను వివిధ రకాల సలాడ్ లలో కూడా కలిపి తీసుకోవచ్చు. రుచితోపాటు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఇంకా ఉడికించి మెత్తగా చేసిన ఆలుగడ్డలను పెరుగుతో కూడా కలిపి తీసుకోవచ్చు. బరువు తగ్గడం కోసం డైటింగ్ చేసే వారు ఉడికించిన ఆలుగడ్డలను తప్పనిసరిగా తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఆలుగడ్డలలోని పోషకాలను కాపాడాలంటే వాటిని నూనెలో గానీ లేదా వెన్నతో గానీ వేయించడం చేయకూడదు. నేరుగా ఉడికించి తినాలి. ఈ విధంగా చేయడం వలన ఆలుగడ్డలను మనం ఒక మంచి ఆహార వనరుగా ఉపయోగించుకోవచ్చు. దీంతో బరువు కూడా తగ్గవచ్చు.