మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో గ్రీన్ బీన్స్ ఒకటి. కొందరు వీటిని బీన్స్ అని కూడా పిలుస్తారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ గ్రీన్ బీన్స్‌లో పోషకాలు అనేకం ఉంటాయి. గ్రీన్ బీన్స్‌ను రోజూ ఉడకబెట్టుకుని తినవచ్చు. లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక కప్పు గ్రీన్ బీన్స్‌ను తినడం వల్ల కేవలం 31 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అలాగే వీటిలో ఫైబర్, విటమిన్ ఎ, సి, కె, థయామిన్, నియాసిన్, విటమిన్ బి6, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది.
2. గ్రీన్ బీన్స్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. వీటిల్లో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల తయారీకి పనిచేస్తుంది. దీంతో రక్తం ఎక్కువగా తయారవుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ మెరుగ్గా సరఫరా అవుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు, శక్తి తక్కువగా ఉందని భావించే వారు రోజూ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. గ్రీన్ బీన్స్ చర్మం, వెంట్రుకల సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని పోషకాలకు గనిగా చెబుతారు. అందువల్ల చర్మం, వెంట్రుకలతోపాటు గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గ్రీన్ బీన్స్‌లో ఓ రకానికి చెందిన సిలికాన్ ఉంటుంది. ఇది కొత్త కణాలను నిర్మిస్తుంది. దీని వల్ల గోళ్లు దృఢంగా మారుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
4. బీన్స్‌లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. కనుక ఆస్టియోకాల్సిన్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీంతో శరీరం కాల్షియంను సులభంగా గ్రహిస్తుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
5. గ్రీన్ బీన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి అవి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ క్రమంలో క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
6. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల బీన్స్‌ను రోజూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. అందువల్ల డిటాక్స్ ఫుడ్‌గా వీటిని చెప్పవచ్చు.
7. గ్రీన్ బీన్స్‌లో కాల్షియంతోపాటు ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రావు.
8. గ్రీన్ బీన్స్‌లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. దీని వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే బీన్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ బీన్స్‌ను తమ ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.