Radish : ముల్లంగి.. ఇది తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ముల్లంగి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగితో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ముల్లంగి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి దీనిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదని మనలో చాలా మందికి తెలియదు. ముల్లంగితో కలిపి తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటి…అలాగే ముల్లంగి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముల్లంగి యొక్క శాస్త్రీయనామం రఫనస్ సాటివస్. దీనిని ఇంగ్లీష్ లో రాడిష్ అని పిలుస్తారు. ముల్లంగితో చట్నీ, కూర చేయడంతో పాటు సాంబార్, సలాడ్ లలో కూడా వేసుకుని తింటూ ఉంటారు. ముల్లంగిలో మన శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపే గుణాలు ఎక్కువగా ఉంటాయి.
జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా ముల్లంగి మనకు దోహదపడుతుంది. ముఖ్యంగా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తంలోని మలినాలను తొలగించడంలో, ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్ ను సరఫరా చేయడంలో ముల్లంగి మనకు ఎంతో సహాయపడుతుంది. ముల్లంగి ఆకులు కూడా కామెర్ల నివారణలో మనకు ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ముల్లంగి ఎంతో తోడ్పడుతుంది. ముల్లంగిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ వాటి ఆకులను తీసుకోవడం వల్ల కూడా కలుగుతాయి. ముల్లంగి ఆకులతో కూరను వండుకుని తింటారు. మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కూడా ముల్లంగి మనకు సహాయపడుతుంది. తాజా ముల్లంగి రసంలో నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తాగడం వల్ల అన్ని రకాల మూత్రసంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారికి కూడా ముల్లంగి తోడ్పడుతుంది.
ముల్లంగిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముల్లంగిని తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ముల్లంగిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముల్లంగిని తీసుకోవడం వల్ల మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాము. ముల్లంగిని ఆహారంగా తీసుకోవడం వల్ల వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. అలాగే తేనెటీగలు, కందిరీగలు, దోమలు వంటి కీటకాలు కుట్టినప్పుడు ఆ భాగంలో నొప్పి, మంట, వాపు ఎక్కువగా వస్తూ ఉంటుంది.
అలాంటప్పుడు ముల్లంగి రసాన్ని కీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. ముల్లంగికి శరీరంలో అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించే శక్తి ఉంది. ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. ముల్లంగి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి దీనిని అధిక మోతాదులో తీసుకోకూడదు. ముల్లంగిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అతిసారం బారిన పడే అవకాశం ఉంది. అదే విధంగా ముల్లంగిని తిన్న వెంటనే అదే విధంగా ముల్లంగిని తిన్న తరువాత కొన్ని రకాల ఆహారాలను తీసుకోకూడదు. ముల్లంగిని తిన్న తరువాత లేదా ముల్లంగితో కలిపి పాలను తాగకూడదు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే ముల్లంగిని, కీరదోసను కూడా కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ముల్లంగితో లేదా ముల్లంగి తిన్న తరువాత కాకరకాయను తినకూడదు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే తలనొప్పి, ఛాతిలో మంట వంటి సమస్యలు వస్తాయి. అలాగే ముల్లంగిని తిన్న తరువాత నిమ్మజాతి పండ్లను కూడా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ విధంగా ముల్లంగి మనకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.