Bitter Gourd : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల కూరగాయల్లో కాకరకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే కాకరకాయలను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఇవి చేదుగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎవరూ తినరు. కొందరు మాత్రం వీటితో రకరకాల కూరలను చేసి తింటారు. అయితే కాకరకాయలను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. అలాగే యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల కాకరకాయలను తింటే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
ఇక వీటిని తినడం వల్ల విటమిన్ సి, ఇ, బి విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలను పొందవచ్చు. అయితే కాకరకాయలను తినడం వల్ల లాభాలు కలుగుతాయి సరే. కానీ చేదుగా ఉంటాయి కదా. వాటిని ఎలా తినడం. చేదు లేకుండా తినలేమా..? అంటే.. అందుకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే.. కాకరకాయల్లోని చేదును సులభంగా తగ్గించవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయలను వండుకోవడానికి ముందు వాటిని ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం నీళ్లను పోసి ఉప్పు మొత్తం పోయేలా మళ్లీ కడగాలి. దీంతో చాలా వరకు చేదు తగ్గుతుంది. ఇక చేదు తగ్గాలంటే కాకరకాయల్లో ఉండే గింజలను తీసేయాలి. వీటి వల్ల చేదు ఎక్కువవుతుంది కనుక కాకరకాయలను కట్ చేసే సమయంలోనే గింజలను తీసేస్తే మంచిది. దీంతో చేదును తగ్గించుకోవచ్చు.
ఇక కాకరకాయలను కాస్త ఉడికించిన తరువాత వాటిల్లో ఉప్పు వేసి కడగాలి. ఇలా చేసినా కూడా చేదు తగ్గుతుంది. ఆ తరువాత వాటితో కావల్సిన విధంగా కూరను చేసుకోవచ్చు. ఇక కాకరకాయల చేదు తగ్గాలంటే కాకరకాయలను వండుకోడానికి ముందు పెరుగులో ముక్కలు వేసి కడగాలి. ఆ తర్వాత వండుకుంటే చేదు తగ్గుతుంది. ఇక డీప్ ఫ్రై చేయడం వల్ల కూడా కాకరకాయలలో ఉండే చేదు తగ్గుతుంది. అలాగే బెల్లం లేదా పంచదార వేసుకుని వండడం వల్ల కూడా ఇందులో ఉండే చేదును మనం తొలగించవచ్చు. ఇలా ఈ విధంగా కాకరకాయలలో చేదు తొలగించి వాటిని వండుకుని తినవచ్చు. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.