Green Chilli : పచ్చిమిర్చి… ఇది తెలియని వారుండరు. మనం ప్రతిరోజూ వంటల్లో విరివిరిగా ఈ పచ్చిమిర్చిని ఉపయోగిస్తూ ఉంటాం. అందరూ ఎంతో ఇష్టంగా తినే రోటి పచ్చళ్లల్లో, చట్నీల తయారీలో వీటిని వాడుతూ ఉంటాం. కొందరు మజ్జిగతో కూడా పచ్చిమిర్చిని తింటూ ఉంటారు. అయితే కారంగా ఉండే శరీరానికి హానిని కలిగిస్తాయని చాలా మంది వీటిని తక్కువగా వాడతారు. అయితే కారంగా ఉండే అన్ని పదార్థాలు శరీరానికి హానిని కలిగించవని నిపుణులు చెబుతున్నారు. ఇతర ఆహార పదార్థాల వలె పచ్చిమిర్చి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పచ్చిమిర్చిని ఎంత మోతాదులో తీసుకోవాలి..అలాగే ఏలా తీసుకోవాలి.. పచ్చిమిర్చి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు ఒక పచ్చిమిర్చిని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. పచ్చిమిర్చిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే పచ్చిమిర్చిని తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. లోబీపి సమస్యతో బాధపడే వారికి పచ్చిమిర్చి ఎంతో మేలు చేస్తుంది. పచ్చిమిర్చిలో కాపర్, నియాసిన్, విటమిన్ బి 6, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, ఫోలేట్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని పెంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో లోబీపి, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. లోబీపీ, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారు రోజుకు ఒక పచ్చిమిర్చిని తినడం వల్ల ఆయా సమస్యలను దేరం చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ ఒక పచ్చిమిర్చిని తినడం వల్ల క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నశింపజేసి మనల్ని అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పచ్చిమిర్చి మనకు సహాయపడుతుంది. రోజూ ఒక పచ్చిమిర్చిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిని విత్తనాలతో సహా తినడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. పచ్చిమిర్చిని తినడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. సైనస్ తో బాధపడే వారికి పచ్చిమిర్చి చక్కటి ఔషధంలా పని చేస్తుంది. రోజూ ఒక పచ్చిమిర్చిని తినడం వల్ల సైనస్ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే శక్తి కూడా పచ్చిమిర్చికి ఉంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు రోజూ ఒక పచ్చిమిర్చిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
పచ్చిమిర్చిలో ఉండే గింజలను నువ్వుల నూనెలో వేసి వేడి చేయాలి. తరువాత ఈ నూనెను కీళ్ల నొప్పులపై రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా పచ్చిమిర్చి మనకు ఎంతో మేలు చేస్తుందని దీనిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.