Weight Gain : అధిక బరువు సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు. బరువు తగ్గడానికి వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. బరువు తగ్గడం ఎంత కష్టమో బరువు పెరగడం కూడా అంతా కష్టం. బరువు అధికంగా ఉన్నా అదే విధంగా మరీ బరువు తక్కువగా ఉన్నా కూడా అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యవంతులు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
హైపర్ థైరాయిడిజం, షుగర్ వంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా కొందరు బరువు తక్కువగా ఉంటారు. బరువు తక్కువగా ఉన్నవారు లావుగా అవ్వడానికి జంక్ ఫుడ్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడమే కాదు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే బరువు పెరగడానికి బయట దొరికే టాబ్లెట్ లను, పౌడర్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. బరువు పెరగడానికి కూడా చక్కటి ఆహార నియమాలను కలిగి ఉండాలి. ఇలా చేయడం వల్ల అనవసరమైన చోట కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
ఆరోగ్యవంతంగా బరువు పెరగడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరు రోజుకు 2000 క్యాలరీల వరకు ఖర్చు చేస్తూ ఉంటారు. బరువు పెరగాలనుకునే వారు అంత కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకోవాలి. అరటి పండు, పాలు, పన్నీర్, నెయ్యి, ఎండు ద్రాక్ష, ఖర్జూర పండ్లు. వీటిలో అధిక క్యాలరీలు ఉంటాయి. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఉదయం పూట రెండు అరటి పండ్లను, ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి. నల్లటి మచ్చలు ఉన్న అరటి పండును తీసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే నల్లటి మచ్చలు ఉన్న అరటి పండ్లల్లో పోషకాలు, క్యాలరీలు అధికంగా ఉంటాయి.
అదే విధంగా ఒక జార్ లో 5 లేదా 6 ఖర్జూర పండ్లను వేయాలి. తరువాత అందులో ఒక గ్లాస్ పాలను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాలను ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతో పాటు కండరాలు బలపడి త్వరగా బరువు పెరుగుతారు. అలాగే బరువు పెరగడంలో ఎండు ద్రాక్ష కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గుప్పెడు ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఎండు ద్రాక్షను ఉదయాన్నే తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.
బరువు పెరగాలనుకునే వారు నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రెండు రోజులకు ఒకసారి గుప్పెడు పల్లీలను 12 గంటల పాటు నీటిలో నానబెట్టుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా బరువు పెరుగుతారు. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 లేదా 3 కోడిగుడ్లను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అలాగే బరువు తక్కువగా ఉన్నా కూడా రోజుకు ఒక గంట పాటు వ్యాయామం చేయాలి.
బరువు పెరగాలనుకునే వారు భోజనం చేయడానికి ముందు అలాగే చేసిన తరువాత నీటిని తాగకూడదు. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని ఒకే సారి ఎక్కువగా తీసుకోకూడదు. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఆహారాన్ని రోజుకు నాలుగు నుండి ఐదు సార్లు తీసుకోవాలి. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. అదే విధంగా పండ్ల రసాలను కూడా తాగుతూ ఉండాలి. దీని వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అంది బరువు పెరుగుతారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఆరోగ్యవంతంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.