కుటుంబ బాధ్యతంతా తమ భుజాల మీదే ఉందని, భార్యలు కేవలం వంటింటి కుందేళ్లేనని ఫీల్ అవుతున్న ప్రతి భర్తకు ఈ పోస్ట్ అంకింతం.. ఒక భర్తకు, సైకాలజిస్టుకు మధ్య జరిగిన సంభాషణ(ఇంటర్నెట్‌లో విస్తృత ప్రచారంలో ఉన్న పోస్టు)
సై: మీరు ఏం చేస్తారు?
భ: నేను బ్యాంక్‌లో ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను.
సై: మీ భార్య ఏం చేస్తారు?
భ: ఆమె ఇంట్లోనే ఉంటుంది.
సై: మీ కుటుంబానికి ఉదయం పూట అల్పాహారం ఎవరు తయారుచేస్తారు?
భ: నా భార్య. ఎందుకంటే తనకు ఉద్యోగం ఏమీ లేదు కాబట్టి.
సై: అల్పాహారం తయారు చేయడానికి మీ భార్య ఏ సమయానికి నిద్ర లేస్తుంది?
భ: తను తెల్లవారుజామున 5 గంటలకు లేస్తుంది. ముందు ఇల్లు శుభ్రం చేసి తర్వాత అల్పాహారం తయారు చేస్తుంది.
సై: మీ పిల్లలు స్కూల్‌కి ఎలా వెళ్తారు?
భ: పిల్లలను నా భార్య స్కూల్‌కు తీసుకువెళుతుంది. ఎందుకంటే తను ఏ ఉద్యోగం చేయదు కాబట్టి.
సై: పిల్లలను స్కూల్‌లో దింపి వచ్చిన తర్వాత మీ భార్య ఇంట్లో ఏం చేస్తుంది?
భ: మార్కెట్‌కు వెళ్ళి కూరగాయలు తెచ్చి వంట చేస్తుంది. తర్వాత బట్టలు ఉతుకుతుంది. మీకు తెలుసు కదా తను ఉద్యోగం ఏమీ చేయదని! అందుకే అలా!
సై: మీరు సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత ఏం చేస్తారు?
భ: విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకంటే రోజంతా పని చేసి అలసి పోయి ఉంటాను అందుకే.
సై: మీ భార్య ఏం చేస్తుంది?
భ: వంట తయారు చేస్తుంది. పిల్లలకు పెడుతుంది. తర్వాత నాకు. ఆ తర్వాత పిల్లలను నిద్ర పుచ్చుతుంది. తర్వాత అంట్లు తోముకుంటుంది. ఇల్లు శుభ్రం చేసుకుంటుంది. తర్వాతే తను నిద్రపోతుంది.
పైన చెప్పిన కథలో ఎక్కువ పని ఎవరు చేస్తున్నారంటారు? తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు విశ్రాంతి లేకుండా రోజంతా పనిచేసేది భార్యే. కానీ భర్త దృష్టిలో ఆమె ఉద్యోగం ఏమీ చేయడం లేదు కాబట్టి, పని చేయనట్టే! అవును! గృహిణులకు ఇంటి పని చేయడానికి ఎలాంటి విద్యార్హతలు, అనుభవం అవసరం లేదు. కానీ కుటుంబంలో తన పాత్ర చాలా ముఖ్యం.
ఉద్యోగం చేస్తేనే పని చేస్తున్నట్లు అనే భావన నుంచి బయటపడాలి. ముందు మీ భార్యను అభినందించండి. ఎందుకంటే వారు చేస్తున్న త్యాగాన్ని దేనితోనూ కొలవలేం. ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించ కుండా వారు చేస్తున్న బాధ్యతాయుతమైన పనిని కించ పరచకండి. ఈ సంభాషణ చాలామంది ఆలోచన లకు ప్రతిబింబం లాంటిది. అందుకే ఎప్పుడూ ఇంట్లో ఒకరి పాత్రను మరొకరు కించపరుచుకోకుండా సహకరించుకోండి. అప్పుడే సంసారం ఆనందమయం అవుతుంది.