మ్యాజిక్ షోలంటే చాలా మందికి ఇష్టమే. వాటిని జనాలు ఆసక్తిగా చూస్తారు. మెజిషియన్స్ చేసే అన్ని మ్యాజిక్ ప్రదర్శనలను, వాటిల్లోని అంశాలను, భిన్నమైన మ్యాజిక్‌లను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అందులోనే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పొందుతారు. అయితే ఇదంతా ఓకే. ఇంతకీ విషయమేమిటంటారా..? ఏమీ లేదండీ.. మెజిషియన్స్ మ్యాజిక్ చేసేటప్పుడు పలుకుతారే.. అదే.. అబ్రకదబ్ర.. అని అవును. దాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇంతకీ అసలు ఈ పదం ఎలా వాడుకలోకి వచ్చింది, దాన్ని మెజిషియన్స్ ఎందుకు పలుకుతున్నారు..? వంటి అంశాలకు గల పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Abracadabra పదం Arabic పదం avra kadavra నుంచి వచ్చిందని కొందరు చెబుతారు. ఇక హెబ్రూలో ఈ పదాన్ని ab ben ruach hakodesh అని పిలుస్తారు. ఇందులో ab అంటే తండ్రి, ben అంటే కొడుకు అని, ruach hakodesh అంటే దైవాత్మ అని అర్థాలు వస్తాయి. ఈ క్రమంలోనే ఈ భాషకు చెందిన వారు తమకు ఆరోగ్యం కలగాలని, తమకు అదృష్టం కలగాలని, ఏదో ఒక మ్యాజిక్‌తో తమకు అంతా కలసి రావాలని ఈ పదాన్ని చదువుతారు.
ఇక రోమన్లు అబ్రకదబ్రను abraxas అని చదువుతారు. అయితే చాలా మంది avra kadavra అనే పదాన్ని వాడడం మొదలు పెట్టారు. ఇదే Abracadabra పదంగా మార్పు చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మెజిషియన్లు తాము చేసే మ్యాజిక్ కోసం ఈ పదాన్ని వాడడం మొదలు పెట్టారు. అలా అబ్రకదబ్ర వాడుకలోకి వచ్చింది. అయితే ఈ పదం కచ్చితంగా ఎప్పటి నుంచి వాడుకలో ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ అప్పట్లో మాత్రం దీన్ని కొందరు మాంత్రికులు వాడేవారట. అయితే క్రమంగా వారు కనుమరుగు కావడంతో మెజిషియన్లు దాన్ని అందిపుచ్చుకున్నారు. అంతే కానీ నిజంగా అబ్రకదబ్ర అని చదివితే మాయలు జరగవు. మంత్రాలకు చింతకాయలు రాలవు..!