సెలవుల సీజన్ కాదు కాబట్టి రైల్వే స్టేషన్‌లో పెద్దగా సందడి లేదు. రద్దీ ఎక్కువగా కనిపించలేదు. నేను ఎక్కాల్సిన ట్రెయిన్ చివరి ప్లాట్‌ఫామ్ మీద ఉంది. అక్కడి వరకు నడక తప్పదు. నెమ్మదిగా ఎలాగోలా ప్లాట్‌ఫామ్ మీదకు చేరుకున్నా. సీజన్ కాకపోవడంతో ప్రయాణికులు కూడా పెద్దగా ఉన్నట్లు లేరు. అక్కడక్కడా పలుచగా ఉన్నారు. ట్రెయిన్‌లోకి ఎక్కి నా సీట్‌లో కూర్చున్నా. బెర్త్ మాత్రం కిందనే వచ్చింది. కాసేపు ఎలాగో టైమ్ పాస్ చేస్తే ట్రెయిన్ కదులుతుంది. అప్పుడు కిటికీల్లోంచి వచ్చే చల్లని గాలికి హాయిని పొందవచ్చు. ట్రెయిన్ కదులుతుందేమో అని వెయిట్ చేస్తున్నా. ఇంతలో బోగీలోకి ఓ అమ్మాయి వచ్చి ఎక్కింది. బహుశా 18-19 ఏళ్లు ఉంటాయనుకుంటా.
ఆ అమ్మాయిని చూడగానే చూపు తిప్పుకోలేకపోయా. అంత అందంగా ఉంది. ఎంతో పద్ధతిగా కనిపించింది. కూడా ఆమె తండ్రి కూడా ఉన్నాడు. ఆయనకు కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. బహుశా కూతుర్ని ఒక్కత్తినే పంపించడం ఇష్టం లేదు కాబోలు. ఆమెను విడిచిపెట్టి ఉండలేకపోతున్నట్లు ఆయనకు వస్తున్న కన్నీళ్లను చూస్తే తెలుస్తుంది. ఆ అమ్మాయి కూడా కళ్లలో నీరు ఉబికి వస్తుండగా భారంగా ట్రెయిన్‌లోకి ఎక్కింది. నాన్నా.. వెళ్లగానే కాల్ చేస్తా.. గద్గద స్వరంతో చెప్పింది. ఆయనకు మాట రాలేదు. సరే అన్నట్లుగా తల ఊపాడు. ఇంతలో ట్రెయిన్ కూత వేసింది. నెమ్మదిగా కదలడం ప్రారంభమైంది.
ఆ అమ్మాయి తండ్రి కిటికీ పక్కనే ఉండి రన్నింగ్ ట్రెయిన్‌తోపాటు ప్లాట్‌ఫామ్‌పై ముందుకు కదులుతున్నాడు. ట్రెయిన్ వేగం పెరిగింది. ఇంక రాలేనన్నట్లు అక్కడే ఆగి అతను తన కూతుర్ని చూస్తూ చేయి ఊపాడు. ఆమె కూడా ఎంతో బాధతో చేయి ఊపింది. ట్రెయిన్ ఇంకా వేగం పెరిగింది. చూస్తూ ఉండగానే అతని రూపం అదృశ్యమైంది. ఆమె నెమ్మదిగా కళ్లు తుడుచుకుంది. బహుశా తీవ్రమైన బాధలో ఉంది కాబోలు అనుకున్నా. కానీ వెంటనే ఆమె చేసిన పనికి షాకయ్యా. అప్పటి వరకు కళ్ల నిండా ఉన్న నీళ్లు కాస్తా ఆగిపోయాయి. ముఖంపై నవ్వు వచ్చింది.
అలా నవ్వుతూనే ఆ అమ్మాయి తన ఫోన్ తీసి ఎవరికో ఆనందంగా కాల్ చేసింది. అవతలి వారు హలో అన్నట్లు ఉన్నారు. ఈమె కూడా హలో అని మాట్లాడడం మొదలు పెట్టింది. అంతకు ముందు తన తండ్రితో ఎంతో బాధ ఉన్నట్లు నటించిన ఆమెనేనా ఈమె.. అని షాకవుతున్నా.. అంతలోనే ఆమె మాటల్లోని అర్థం గ్రహించా. తాను తెల్లారితే స్టేషన్‌లో దిగుతుందట. తన ప్రియుడిని స్టేషన్‌కు రమ్మని చెప్తూ పెట్టేసింది. ఆమె మాటలకు షాక్ తిన్నా. లోకంలో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా.. అనిపించింది. ఇంత పద్ధతిగా ఉందనుకుంటుంటే తన తండ్రిని ఎలా మోసం చేసింది అనే షాక్‌లోనే ఉన్నా. ఇంతులో మళ్లీ ఏం గుర్తుకు వచ్చిందో తన ప్రియుడికి మళ్లీ ఫోన్ చేసి మాట్లాడడం మొదలు పెట్టింది. ఆ మాటల ప్రవాహం ఆగడం లేదు.. తన నవ్వు కూడా ఆగడం లేదు..!