Off Beat

పిల్లల కోసం ట్రాఫిక్ సూచనలు.. త‌ల్లిదండ్రులు కచ్చితంగా చెప్పాలి..!

జంటనగరాలు మొదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద సంఘటనలు ఈ మధ్య నిత్యకృత్యమైపోయాయి. వీటిలో పసి పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్లవరకూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోవ‌డం ఎన్నో చూశాం. ట్రాఫిక్ పద్మవ్యూహంలో భారీ వాహనచోదకులు బళ్లని వేగంగాను, నిర్లక్షంగాను నడవడం ఈ పరిస్ధితులకు ఒక ప్రధాన కారణమైతే, ట్రాఫిక్ నియంత్రణలోని అవకతవకలు, ట్రాఫిక్ అవగాహనా లోపం, రోడ్లు సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణాలే. రోడ్డుపక్కగా నడుస్తున్న పాదచారుల ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేని పరిస్ధితులు మన రహదారులపై నేడు నెలకొని ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చిన్న పిల్లలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వారిలో ట్రాఫిక్ అవగాహనని పెంపొందిచాల్సిన‌ అవసరం ఎంతో ఉంది.

జంటనగరాల్లో విధ్యార్ధులకు ట్రాఫిక్ అవగాహన‌ సెషన్లు అప్పుడప్పుడు నిర్వహించడం మనకు తెలుసు. కాని పిల్లలందరిలో ట్రాఫిక్ స్పృహని పెంపొందడానికి ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తున్నాం. ఇవి మీ పిల్లలకూ తెలపండి. వాహనం వస్తున్న వేగం, దానికి తామున్న దూరాన్ని అంచనావేసుకోగలిగేంత శక్తిసామర్ధ్యాలు చిన్నపిల్లలకి ఉండవు. రోడ్డుమీద వారిని ఆకట్టుకునే రకరకాల అంశాలు కనబడ్డంతో వారి చూపు వాటి మీదకు పోతుంటుంది. దాంతో ప్రమాదాలకు గురి అవుతారు. పదేళ్ల వయస్సు పిల్లలు డ్రైవరు తమని చూశాడని భావించేసి పరిగెట్టుకుంటూ రోడ్డు దాటాలని చూస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రాధమిక పాఠశాలల్లో చదువుతున్న చాలామంది పిల్లలకు ట్రాఫిక్ సిగ్నల్స్‌కి సంబంధించిన అవగాహన లేదు. వాహ‌నాల కదలికలను వాళ్లు అర్ధం చేసుకోలేరు.

parents must tell these traffic rules to their kids

రోడ్డుపైన ఉన్న ట్రాఫిక్‌ని గమనిస్తూ, జాగ్రత్తగా దాటడం అలవాటైనప్పుడే ట్రాఫిక్ అవగాహన పిల్లల్లో పెంపొందుతుంది. పిల్లలు ఒంటరిగా రోడ్డు దాటకూడదు. వీలైనంతవరకు ఇతరులతో కలిసి రోడ్డు దాటమని వాళ్లకు చెప్పాలి. ఐదేళ్లలోపు పిల్లల్ని పెద్దవాళ్లు చేతులతో గట్టిగ పట్టుకుని రోడ్డు దాటించాలి. లేకపోతే వాళ్లు గబుక్కుని చేతులు వదిలి పారిపోతుంటారు. తల్లిదండ్రులు రోడ్డు ఎలా జాగ్రత్తగా దాటాలో పిల్లలకు తరచూ చూపిస్తూ, సిగ్నల్స్ గురించి వివరిస్తుండాలి. ప్రతి విషయంలోనూ అమ్మానాన్నలను అనుకరించే పిల్లలు ఈ విషయంలో కూడా వారెలా చేశారో తామూ అలానే చేయాలని ప్రయత్నిస్తారు. పిల్లలు ట్రాఫిక్‌ని అర్ధం చేసుకునే దాకా పెద్దవాళ్లు దగ్గర ఉండి వారిని రోడ్డు దాటించాలి. ఇళ్లల్లో అమ్మానాన్నలు, బడిలో ఉపాధ్యాయులు పిల్లల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేలా కృషిచేయాలి. వీటికోసం ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించాలి. అవసరమైతే ట్రాఫిక్ ప్రొఫెషనల్స్‌ని తమ పాఠశాలకు పిలిపించి పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి వారిచేత బోధింపచేయాలి.

ట్రాఫిక్ ఐలెండ్స్ దగ్గర, జీబ్రా క్రాసింగ్‌ల దగ్గర రోడ్డు దాటమని చెప్పాలి. రోడ్డు దాటేటప్పుడు చేతులతో సంజ్ఞలు చేస్తూ వాహనాలను తప్పించుకుని వెళ్లాలి. బళ్లు కుడి లేక ఎడమ ఏ వైపు వెడుతున్నాయో గమనించాలి. నేరుగా వెడతున్నాయా, టర్నింగ్ తీసుకుంటున్నాయా అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి.

Admin

Recent Posts