Chenchalaku : మన చుట్టూ ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయి. కానీ వాటి విలువ మనకు తెలియక మనం వాటిని కలుపు మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్కలల్లో చెంచలాకు మొక్క కూడా ఒకటి. దీనిని సంస్కృతంలో అరణ్య, అరణ్య వస్తుక అని అంటారు. ఈ మొక్క మనకు విరివిరిగా కనబడుతుంది. దీనిని మనం కేవలం కలుపు మొక్కగానే భావిస్తాం. కొన్ని ప్రాంతాలలో దీనిని ఆకులను కూరగా వండుకుని తింటారు. చెంచలాకు మొక్క ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేయడంలో చెంచలాకు మొక్క మనకు ఎంతగానో సహాయపడుతుంది. మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఈ మొక్కలో పుష్కలంగా ఉన్నాయి. కలుపు మొక్కగా భావించే ఈ మొక్కలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. చెంచలాకు మొక్క చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని కూరగా వండుకుని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. చెంచలాకును కూరగా చేసుకుని తినడం వల్ల జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ మొక్క ఆకుల కషాయాన్ని తాగడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయని వారు చెబుతున్నారు. చెంచలాకు మొక్క ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై, పుండ్లపై ఉంచడం వల్ల అవి త్వరగా మానిపోతాయి. రక్త హీనత సమస్యతో బాధపడే వారు చెంచలాకును కూరగా వండుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ మొక్కను సమూలంగా సేకరించి నీళ్లల్లో వేసి కషాయంగా చేసుకుని తాగడం వల్ల బాలింతలలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. శరీరంలోని ఎముకలను దృఢంగా ఉండేలా చేయడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. చెంచలాకును కూరగా వండుకుని తినడం వల్ల అనేక పోషకాలు లభించడంతోపాటు మనం ఆరోగ్యంగా కూడా ఉంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.