Amrutha Kada : ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే మొక్కలలో అమృత కాడ మొక్క కూడా ఒకటి. దీనిని నీరి కసువు, వెన్న తీపి కూర, వెన్న వెదురు, అడవి నాభి, యాండ్ర ఆకు అని కూడా అంటుంటారు. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. 1980 వ సంవత్సరంలో అమృతకాడ మొక్కను ప్రత్యేకంగా కాలిఫోర్నియాకు పరిచయం చేశారు. ఈ మొక్కలు ఎక్కువగా గ్రామాలలో, పచ్చిక బయళ్లలో, బీడు భూముల్లో, అడవి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు కూడా. ఈ మొక్కను కలుపుగా భావించి చాలా మంది వీటిని పీకేస్తూ ఉంటారు. కానీ అమృత కాడ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కను పశువులు చాలా ఇష్టంగా తింటాయి. ఈ మొక్క యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుందని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
గాయాలను, పుండ్లను, చర్మ వ్యాధులను, ముఖంపై మొటిమలను నయం చేయడంలో ఈ మొక్క మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి చర్మం పై సమస్య ఉన్న చోట పై పూతగా రాయడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. అమృత కాడ మొక్క ఆకులు జ్వరానికి మంచి ఔషధంగా పని చేస్తాయి. ఈ మొక్క ఆకులను ఆరింటిని తీసుకుని వాటిని 150 ఎంఎల్ నీటిలో వేయాలి. ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్రను, మిరియాలను వేసి మరిగించి వడకట్టుకోవాలి. ఈ నీటిని రోజుకు ఒకసారి తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది.
అమృత కాడ ఆకులను కూరగా చేసుకుని కూడా తింటూ ఉంటారు. ఇలా కూరగా చేసుకుని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలలో ఈ మొక్క ఆకులను పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను, కాండాన్ని దంచి వాటితో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఈ ఆకులను చల్లని నీటిలో వేసి నలిపి ఆ నీటిని వడకట్టుకుని తాగడం వల్ల మలేరియా జ్వరం తగ్గుతుంది. ఈ మొక్క మొత్తాన్ని పేస్ట్ లా చేసి మొలలపై, ఛాతిపై, నొప్పులపై రాసుకోవడం వల్ల ఔషధంగా పని చేసి ఆయా సమస్యలను నయం చేస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
కాలేయ సంబంధిత సమస్యలను నయం చేయడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. అమృతకాడ మొక్క గొంతునొప్పిని తగ్గించడంలో, కుష్టు వ్యాధిని నయం చేయడంలో అలాగే నాడీ వ్యవస్థ రుగ్మతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా డయేరియా, తలనొప్పి, అతిసారం, దంతాల సమస్యలను తగ్గించడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.