Attipatti : అత్తిపత్తి మొక్క.. ముట్టుకోగానే ముడుచుకుపోయే ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. దీనిని కొన్ని ప్రాంతాల్లో సిగ్గాకు అని కూడా పిలుస్తారు. అత్తిపత్తి మొక్క ఎక్కువగా గ్రామాలలో కనబడుతుంది. దీనిని ఆంగ్లంలో టచ్ మీ నాట్ అని, సంస్కృతంలో నిద్ర భంగి, లజ్జాకు అని పిలుస్తారు. ఈ మొక్క ఎక్కువగా తడి ప్రదేశాలలో, పొదల కింద, చీకటిగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్కలో ఉండే ప్రత్యేక నిర్మాణం వల్ల దీనిని తాకగానే లేదా నీటి బిందువులు పడగానే వెంటనే ముడుచుకుని కొంత సమయం తరువాత మరలా విచ్చుకుంటుంది. ఈ మొక్క ఆకులు మరలా యథాస్థితికి రావడానికి అర గంట నుండి గంట సమయం పడుతుంది.
అత్తిపత్తి మొక్క ఆకుల కింద నీటితో కూడిన సంచుల వంటి నిర్మాణం ఉంటుంది. సంచుల్లో నీరు ఉన్నంత వరకు ఆకులు విచ్చుకుని ఉంటాయి. మొక్కను ముట్టుకోగానే ఆకుల మీద ఉండే స్పర్శ గ్రాహకాలు ఆ సంకేతాలను సంచులకు చేరవేస్తాయి. దీంతో ఆ సంచుల్లో ఉండే నీరు కొమ్మలోకి వెళ్తుంది. ఫలితంగా ఆకులు ముడుచుకుపోతాయి. మరలా కొంత సమయం తరువాత సంచుల్లోకి నీరు చేరుతుంది. దీంతో మళ్లీ ఆకులు విచ్చుకుంటాయి. ఇది ఒకరకమైన రక్షణ వ్యవస్థ. పశువులు వీటిని తాకగానే ముడుచుకోవడం వల్ల మొక్క ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. దీని వల్ల పశువులు వీటిని తినకుండా ఉంటాయి. అత్తిపత్తి చెట్టును భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఔషధంగా ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు.
మన శరీరంలో ఉండే అనేక రుగ్మతలను పోగట్టగల శక్తి ఈ మొక్కకు ఉంటుంది. అత్తిపత్తి మొక్కను ఔషధంగా ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి దానికి పసుపును కలపాలి. ఈ మిశ్రమాన్ని గాయాలపైన రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. నీళ్ల విరేచనాలు, మొలల సమస్యలతో బాధపడే వారు అత్తిపత్తి సమూల చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ పంచదారను కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అత్తిపత్తి ఆకు పొడి ఒక భాగం, పటిక బెల్లం పొడి రెండు భాగాలుగా తీసుకుని వీటి రెండింటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని పూటకు అర టీ స్పూన్ మోతాదుగా మంచి నీటితో కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలలో ఆగిన బహిష్టు మరలా వస్తుంది. అత్తిపత్తి మొక్క పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క వేరును మేకపాలతోనూరి ఆ గంధాన్ని పురుషులు వారి అరికాళ్లకు రాసుకోవాలి. ఇలా రాసుకున్న తరువాత శృంగారంలో పాల్గొనాలి. ఇలా చేయడం వల్ల చాలా సమయం వరకు వీర్య స్కలనం కాకుండా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనవచ్చు. అంతేకాకుండా శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.
అత్తిపత్తి గింజలు, చింత గింజల పప్పు, నీరుగొబ్బి గింజల పప్పును సమపాళ్లలో తీసుకుని మర్రి పాలల్లో రాత్రంతా నానబెట్టాలి. తరువాత వీటిని బయటకు తీసి గాలికి ఆరబెట్టి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని శనగ గింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. వీటిని రెండు పూటలా పూటకు మూడు మాత్రల చొప్పున మంచి నీటితో కలిపి తీసుకోవాలి. ఆ తరువాత వెంటనే కండచక్కెర కలిపిన నాటు ఆవు పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరగడమే కాకుండా వారిలో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
అత్తిపత్తి మొక్క సమూల చూర్ణాన్ని, అశ్వగంధ దుంపల చూర్ణాన్ని సమపాళ్లల్లో తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకుని నీటితో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని స్త్రీలు రాత్రి పడుకునే ముందు స్తనాలకు రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జారిన స్తనాలు బిగువుగా తయారవుతాయి. ఈ విధంగా అత్తిపత్తి మొక్క మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.