Avisaku : అవిసె చెట్టు.. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. గ్రామాల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. తెల్ల పూలు పూసేవి, నల్ల పూలు పూసేవి, ఎర్ర పూలు పూసేవి, పసుపు పూలు పూసేవి.. ఇలా నాలుగు రకాల అవిసె చెట్లు ఉంటాయి. అవిసె చెట్టు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులను కూరగా కూడా వండుకుని తింటూ ఉంటారు. ఈ చెట్టు బెరడు, ఆకులు, పువ్వులు చేదు రుచిని, వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అవిసె చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గవద బిళ్లలతో బాధపడే వారు అవిసె చెట్టు ఆకులను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవిశాకును, గుల్ల సున్నాన్ని కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గవద బిళ్లలపై ఉంచి దూదిని అట్టించాలి. ఇలా చేయడం వల్ల గవదబిళ్లల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
అలాగే అవిశాకును వండుకుని తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అదే విధంగా అధిక బరువు సమస్యతో బాధపడే వారు అవిశాకును వండుకుని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి చాలా సులభంగా బరువు తగ్గుతారు. రేచీకటిని తగ్గించే గుణం కూడా అవిశాకుకు ఉంది. అవిశాకును శుభ్రంగా కడిగి దాని నుండి రసాన్ని తీయాలి. తరువాత ఈ రసాన్ని వడకట్టి ఒక చుక్క మోతాదులో కంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కళ్ల మసకలు, రేచీకటి సమస్య తగ్గుతుంది. కళ్లు చక్కగా కనబడతాయి. ఉబ్బసం వ్యాధితో బాధపడే వారు అవిసె చెట్టు గింజలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 40 గ్రాముల అవిసె చెట్టు గింజలను, 10 గ్రాముల మిరియాలను విడివిడిగా వేయించి పొడిగా చేసుకోవాలి. తరువాత వీటిని జల్లించి కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 3 గ్రాముల మోతాదులో రెండు పూటలా ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే నాలుగు వారాల్లో ఉబ్బసం తగ్గుతుంది.
మూత్రపిండాల సమస్యలను తగ్గిచే గుణం కూడా అవిసె చెట్టుకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అవిసె చెట్టు గింజలను దోరగా వేయించాలి. ఈ గింజల సగం బరువుకు సమానంగా కండచక్కెరను కలిపి మెత్తగా దంచాలి. ఈ మిశ్రమాన్ని 10 గ్రాముల మోతాదులో లడ్డూల్లా చుట్టుకోవాలి. మూత్రపిండాలు పాడైన వారు అలాగే వివిధ రకాల మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు ఈ లడ్డూలను పూటకు ఒకటి చొప్పున రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పాడైన మూత్రపిండాలు కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే అవిసె చెట్టు గింజలను, పసుపు కొమ్మును సమానంగా కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని వ్రణాలపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల మూడు నుండి నాలుగు రోజుల్లోనే గడ్డలు పగిలిపోతాయి. అదే విధంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కూడా అవిసె చెట్టు మనకు ఉపయోగపడుతుంది.
అవిసె చెట్టు గింజలను, ఆముదం గింజల్లో ఉండే పప్పును సమానంగా తీసుకోవాలి. వీటిని నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఇలా నూరగా వచ్చిన మిశ్రమం పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొవ్వు పేరుకుపోయిన భాగాలపై పట్టులా వేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అంతేకాకుండా అవిసె చెట్టు సౌందర్య సాధనంగా కూడా పని చేస్తుంది. అవిసె చెట్టు పూలను ఆరబెట్టి దంచి నిలువ చేసుకోవాలి. ఈ పొడిని తగిన మోతాదులో తీసుకుని గేదె పాలను కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమంలో వెన్న కలిపి చర్మానికి రాసుకోవాలి. ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది. అవిసె చెట్టు ఈ విధంగా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.