Custard Apple Leaves : మనకు కాలానుగుణంగా కొన్ని రకాల పండ్లు, ఫలాలు లభిస్తూ ఉంటాయి. ఇలా లభించే వాటిల్లో సీతాపలం కూడా ఒకటి. చలికాలంలో ఈ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. సీతాఫలం ఎంతటి కమ్మటి రుచిని కలిగి ఉంటుందో మనందరికి తెలిసిందే. వీటిని తినాలనే కోరికతో ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు చాలా మంది. ఈ పండ్లను తినడం కోసం చలికాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. అంతటి మధురమైన రుచిని ఈ సీతాఫలాలు కలిగి ఉంటాయి. రుచితో పాటు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను, అలాగే ఔషధ గుణాలను కూడా ఈ సీతాఫలాలు కలిగి ఉంటాయి.
సీతాఫలాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా దీనిలో అధికంగా ఉన్నాయి. అలాగే మన శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపే దివ్యౌషధ ఫలం సీతాఫలం. దీనిని తినడం వల్ల మెదడుకు శక్తి లభిస్తుంది. అనేక కారణాల వల్ల చాలా మంది అప్పుడప్పుడు స్పృహ కోల్పోతుంటారు. అలాంటి వారికి ఈ సీతాఫలం ఆకుల రసం వాసన చూపిస్తే వెంటనే స్పృహలోకి వస్తారు. సీతాఫలాలతో పాటు ఈ చెట్టు ఆకులు, వేర్లు, బెరడు కూడా ఎన్నో వ్యాధులకు ఔషధంలా ఉపయోగపడతాయి. సీతాఫలం అన్ని భాగాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి దీనిని అమృత ఫలం అని అంటారు. బరువు పెరగాలనుకునే వారికి సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుంది.
సీతా ఫలం గుజ్జులో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. సీతాఫలాల్లో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. సీతాఫలం గుజ్జులో తేనెను కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి క్యాల్షియం సమృద్ధిగా అంది ఎముకలు ధృడంగా అవుతాయి. పిలల్లో మెదడు పెరుగుదలకు సీతాఫలం ఎంతగానో దోహదపడుతుంది. సీతాఫలం గుజ్జును గోరు వెచ్చని పాలల్లో కలిపి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. తలలో చుండ్రుకు సీతాఫలం గింజలు మంచి ఔషధంలా పని చేస్తాయి. బాగా ఎండిన సీతాఫలం గింజలను పొడిగా చేయాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసి మర్దనా చేసి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. గాయాలు తగిలినప్పుడు సీతాఫలం ఆకుల రసాన్ని గాయలపై లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
దంత సంబంధిత సమస్యలను కూడా సీతాఫలం ఆకులను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. సీతాఫలం ఆకుల రసాన్ని దంతాల నొప్పులు, వాపులపై రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ రసాన్ని చిగుళ్లపై రాయడం వల్ల చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగుతుంది. సీతాఫలాలను రోజూ తీసుకోవడం వల్ల మూత్రసంబంధిత సమస్యలు తగ్గుతాయి. మూత్రం సాఫీగా వస్తుంది. నరాల బలహీనత, మలబద్దకం సమస్య ఉన్న వారు సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ పండును పరగడుపున తీసుకోకూడదు. అలాగే దీనిని పరిమితంగానే తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినకపోతేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్, అస్థమా, లివర్, మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు సీతాఫలానికి దూరంగా ఉండాలి. ఈ విధంగా సీతాఫలం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సీతాఫలం లభించే కాలంలో దీనిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.