మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉన్నాం. అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో తిప్ప తీగ కూడా ఒకటి. గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో ఈ మొక్క మనకు ఎక్కువగా కనబడుతుంది. దీనిని హిందీలో గిలోయ్ అని పిలుస్తారు. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అనేక రకాల ఔషధాల తయారీలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. దాదాపుగా మనకు వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యన్నింటినీ నయం చేసే శక్తి తిప్ప తీగకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కొన్ని వందల సంవత్సరాల నుండి దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ తీగ ఆకులు వగరు, కారం, చేదు రుచులను కలిగి ఉంటాయి. తిప్ప తీగ ఆకులతోపాటు కాండంలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. మనకు మార్కెట్ లో తిప్ప తీగ కాండంతో చేసిన జ్యూస్ తోపాటు చూర్ణం కూడా లభ్యమవుతుంది. ఈ తిప్ప తీగ ఆకులను రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని నేరుగా తినలేని వారు ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు.
తిప్ప తీగ ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరాన్ని రోగాల బారిన పడకుండా ఉండేలా చేస్తాయి. తిప్ప తీగలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. దీని ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రక్తం శుద్ది అవుతుంది. తిప్ప తీగ ఆకులను తినడం వల్ల లేదా వాటితో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల విష జ్వరాలు కూడా తగ్గుతాయి.
అజీర్తి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ కషాయాన్ని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. లేదా ఈ ఆకుల పొడిని బెల్లంతో కలిపి తీసుకున్నా కూడా అజీర్తి సమస్య తగ్గుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఈ తిప్ప తీగ కషాయం దివ్యౌషధంగా పని చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ తిప్ప తీగ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నిత్యం ఆందోళనలతో బాధపడే వారు కూడా ఈ కషాయాన్ని తీసుకుంటే చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తిప్ప తీగ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల లేదా ఈ ఆకుల పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ ఆకుల పొడిని నీళ్లలో కలిపి ఆ నీటితో కళ్లను తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. తిప్ప తీగను, తులసి ఆకులను కలిపి తింటే స్వైన్ ఫ్లూను ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది. తిప్ప తీగ ఆకులను తినడం వల్ల మూత్ర పిండాలలో రాళ్ల సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడే గుణం కూడా తిప్ప తీగకు ఉంటుంది.
తిప్ప తీగ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. అంతేకాకుండా ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. తిప్ప తీగ ఆకులను మెత్తగా నూరి కుంకుడుకాయ పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల కామెర్ల వ్యాధి నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా తిప్ప తీగ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.